ప్రముఖ ఒడిశా రచయిత్రి యశోధర మిశ్రకు 2020 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. ఆమె రచించిన 'సముద్ర కులె ఘొరో' (సాగర తీరంలో ఇల్లు) కథల సంకలనానికి ఈ పురస్కారం లభించిందని అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రముఖ రచయిత ఆచార్య భువనేశ్వర్ మిశ్ర కుమార్తె అయిన యశోధర సంబల్‌పూర్‌లో 1951లో జన్మించారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సరోజినీ నాయుడు కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేసిన ఆమె ఉద్యోగ విరమణ తర్వాత దిల్లీలో స్థిరపడ్డారు. 2018లో ఆమె రచించిన సముద్ర కులె ఘొరో కథల సంకలనానికి పాఠకుల నుంచి మంచి ఆదరణ దక్కింది.
సామాజిక ఇతివృత్తంతో కూడిన 7 కథల సంపుటి అయిన 'సముద్ర కులె ఘొరో'లోని ప్రతి కథా సమాజాన్ని ప్రభావితం చేసి ఆలోచింపజేస్తుంది. యశోధర రచించిన జొహ్నొరాతి, ముహోపొంజ, రేఖాచిత్రో, దెఖానోహలి, సొబుటుసుఖీఝియో, ద్వీపో తదితర రచనలు సైతం మన్ననలందుకున్నాయి. యశోధర బుధవారం దిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు తనను ఎంపిక చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. త్వరలో మరిన్ని కథల సంకలనాలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆమెకు అవార్డు లభించడంపట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:కుప్పకూలిన మిగ్ యుద్ధవిమానం- భారీగా మంటలు