పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇప్పటికే పెరోల్‌పై బయట ఉన్న చౌతాలా(86).. శుక్రవారం ఉదయం తీహార్ జైలుకు వెళ్లి విడుదల ప్రక్రియను అధికారికంగా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
కొవిడ్ దృష్ట్యా.. తొమ్మిదిన్నర ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన ఖైదీలకు ఆరు నెలలు ఉపశమనం ఇస్తున్నట్లు గతంలో దిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో చౌతాలాకు పెరోల్ లభించింది.
2013లో..
ఉపాధ్యాయ నియామకం కుంభకోణం కేసుకు సంబంధించి 2013లో చౌతాలా జైలు పాలయ్యారు. 2020 మార్చి 26న ఆయనకు ఎమర్జెన్సీ పెరోల్ లభించింది. 2021 ఫిబ్రవరి 21న మళ్లీ జైలుకు రావాల్సిందిగా ఆదేశాలిచ్చారు అధికారులు. తర్వాత ఆయనకు పెరోల్ గడువు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది.
ఓపీ చౌతాలా, ఆయన కుమారుడు అజయ్ చౌతాలా, మరో 53 మంది ఈ కేసుకు సంబంధించి శిక్ష అనుభవించారు. ఇందులో ఐఏఎస్ అధికారి సంజీవ్ కుమార్ కూడా ఉన్నారు. 2000 సంవత్సరంలో 3,206 మందిని అక్రమంగా ఉపాధ్యాయులుగా నియమించడంలో వీరు కీలక పాత్ర పోషించారు.
ఇదీ చదవండి:హరియాణా మాజీ సీఎం జైలు గదిలో సెల్‌ఫోన్