బంగాల్ బీర్భుమ్ జిల్లాలోని కోపాయి నది.. అమ్మకానికి సిద్ధంగా ఉందంట. స్థానిక యంత్రాంగం ప్రోత్సాహంతో.. ల్యాండ్ మాఫియా, రియల్టర్లు నదీ స్థలాన్ని ఆక్రమించాలని చూస్తున్నారన్నది రుద్రాపుర్ గ్రామస్థుల ఆరోపణ. ఈ కోపాయి నదికి ఆనుకొనే.. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ కూడా ఉంది.
రివర్ బెడ్స్ ఆక్రమించుకొని.. ఇప్పటికే కొందరు పిల్లర్లు, కంచెలు కూడా వేశారు. కొంత కాలంగా పర్యటకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. ఇక్కడ రిసార్టులు, కాఫీ షాపులు నిర్మించాలని అధికార పార్టీ నేతలు చూస్తున్నట్లు ఆరోపిస్తున్నారు స్థానికులు.
ఠాగూర్ జీవితంతో ఎంతో ముడిపడి ఉన్న బోల్పుర్ శాంతినికేతన్ వద్ద చెట్లు నరికి భవంతులు, రిసార్టులు కట్టడం స్థానికుల్లో ఆగ్రహానికి కారణమైంది. నదులు, సముద్రాలు, అటవీ భూభాగం, పర్వతాలు, ఇతరత్రా వాటిని అమ్మడం చట్టవిరుద్ధమని, కానీ ఇక్కడ ప్రైవేటు యాజమాన్యాలు సులువుగా తమ నియంత్రణలోకి తెచ్చుకుంటున్నాయని అంటున్నారు వారు.
''చట్టం ప్రకారం.. నదీ తీరాన్ని విక్రయించడం విరుద్ధం. కానీ.. ఇక్కడి ల్యాండ్ మాఫియాకు నది ఒడ్డును అమ్మేందుకు చట్టంగా మారింది. జిల్లా యంత్రాంగం కూడా వాటికి అనుమతిస్తోంది. కోపాయి నదిని రక్షిస్తామని హామీలు మాత్రం ఇస్తున్నారు.''
- స్థానికుడు
కోపాయి నదిని ఆనుకొని రుద్రాపుర్ సహా చాలా గ్రామాలు ఉన్నాయి. చేపలు పట్టేందుకు, స్నానం చేసేందుకు చాలా మంది అక్కడికి వెళ్తుంటారు. ఆక్రమణలు ఇలాగే కొనసాగితే.. చాలా నష్టపోతామని చెబుతున్నారు స్థానికులు.
అయితే.. ఈ పూర్తి ఘటనపై దర్యాప్తు చేసి, పూర్తి నివేదిక సమర్పించాలని బీఎల్ఆర్ఓకు సూచించినట్లు తెలిపారు బోల్పుర్ సబ్ డివిజినల్ ఆఫీసర్.
''నదీ తీరం అమ్మకం పూర్తిగా చట్ట విరుద్ధం. అలా జగరనివ్వం. మేం దీనిపై దృష్టిసారిస్తాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.''
- రోనేంద్రనాథ్ సర్కార్, రుద్రాపుర్ గ్రామపంచాయతీ డిప్యూటీ చీఫ్
ఇదీ చదవండి: వైవిధ్యాలున్నా జాతిహితమే అంతిమ లక్ష్యం