ఉచిత విద్యుత్‌కు బదులుగా తననే కోరుకున్న ఓ యువతికి దిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా భలే సమాధానం ఇచ్చారు. పంజాబ్‌లో ఉచిత విద్యుత్ కావాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించాలంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు యువతి స్పందిస్తూ.. 'నాకు ఉచిత విద్యుత్ వద్దు.. రాఘవ్ కావాలి' అంటూ ఎమ్మెల్యేను ఉద్దేశించి ట్వీట్ చేసింది.
ఈ ట్వీట్ రాఘవ్ చద్దా దృష్టిని ఆకర్షించింది. ఆమె కామెంట్ పట్ల ఎమ్మెల్యే కూడా అంతే ఆశ్చర్యకరంగా సమాధానమిచ్చారు. 'పార్టీ మేనిఫెస్టోలో నేను లేను.. ఉచిత విద్యుత్ మాత్రమే ఉంది. కావాలంటే పంజాబ్‌లో ఆప్ అధికారం చేపట్టాక మీ ఇంటికి ఉచితంగా నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేట్టు చూస్తాలే' అంటూ ఆమె ట్వీట్‌కు బదులిచ్చారు.
అయితే ట్విటర్‌లో ఆ యువతికి సంబంధించిన ట్వీట్‌ను కొద్దిసేపటి తర్వాత తొలగించగా.. రాఘవ్ ఆ ట్వీట్ల స్క్రీన్‌షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయడమే లక్ష్యంగా ఇటీవల ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఇటీవల అక్కడ పర్యటించి ఉచిత విద్యుత్‌తో పాటు పలు హామీల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి : ప్రతిష్టంభనలతో ₹130 కోట్ల ప్రజాధనం వృథా!