మొన్న బిహార్.. నిన్న గుజరాత్.. నేడు తమిళనాడు, బంగాల్.. దేశ నలువైపులా పార్టీని విస్తరించడంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దూసుకుపోతున్నారు. మరి తమిళనాడులోనూ ఓవైసీకి ఎదురు ఉండదా? లేక ఆయన జోరుకు ఇక్కడ కళ్లెం పడుతుందా? తమిళనాడులో ఏఎంఎంకేతో ఓవైసీ పార్టీ కుదుర్చుకున్న పొత్తుతో ఎవరికి లాభం?
మూడు స్థానాల్లో..
టీటీవీ దినకరన్‌కు చెందిన ఏఎంఎంకే(అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం)తో పొత్తు కుదుర్చుకున్నారు ఓవైసీ. ఫలితంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడు నియోజకవర్గాల నుంచి ఏఐఎంఐఎం బరిలో దిగనుంది.
ఇదీ చూడండి:- బంగాల్ దంగల్: ఓవైసీ ఎంట్రీతో దీదీకి పరేషాను?
బిహార్ ఎన్నికల్లో అనూహ్యంగా.. 5 స్థానాల్లో గెలిచింది ఏఐఎంఐఎం. అయితే తమిళనాడులో పోటీ చేసే మూడు సీట్లల్లో గెలవడం కష్టమే అని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. కానీ.. ఈ పొత్తుతో.. 'భాజపా మద్దతుదారు' అని ఏఐఎంఐఎంకు ఉన్న పేరును తొలగించుకునే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. భాజపా వ్యతిరేక నినాదాన్ని ఐఎంఎంకే అనుసరిస్తుండటమే ఇందుకు కారణమంటున్నారు.
మరోవైపు.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమిని దినకరన్ పార్టీ కొంతమేర సొమ్ము చేసుకుంది. ఓవైసీతో పొత్తుతో ఇది ఇంకా పెరుగుతుందని భావిస్తోంది.
ముస్లిం ఓటర్లు...
2011 జనాభా లెక్కల ప్రకారం... రాష్ట్ర జనాభా 7.21కోట్లు కాగా.. అందులో ముస్లిం సంఖ్య 42లక్షలు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వీరిపైనే ఆధారపడనప్పటికీ.. అంచనాలను తారుమారు చేసే సత్తా వీరికి ఉంది.
గత ఎన్నికల్లో.. 10 నియోజకవర్గాల్లో గెలిచిన, ఓడిన అభ్యర్థుల మధ్య ఓట్ల వ్యత్యాసం 1000 ఓట్ల కన్నా తక్కువే. 25 సీట్లలో ఆ వ్యత్యాసం 3వేల కన్నా తక్కువగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని.. డీఎంకే, అన్నాడీఎంకే ముస్లిం పార్టీలతో పొత్తు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి.
2016లో డీఎంకే.. రెండు ముస్లిం పార్టీల(ఏయూఎంఎల్, ఎంఎంకే)తో బంధాన్ని ఏర్పరచుకుంది. ఏయూఎంఎల్.. పోటీ చేసిన ఐదు సీట్లలో ఒకటి గెలుపొందగా.. ఎంఎంకే బరిలో దిగిన మూడింట్లో ఒక్కచోట కూడా విజయం సాధించలేదు.
మనిథనేయ జననాయగ కచ్చి, తమిళ మానిల ముస్లిం లీగ్ పార్టీ.. అన్నాడీఎంకేతో మైత్రి ఏర్పరచుకుని ఎన్నికల్లో బరిలో దిగాయి. కూటమి లెక్కల ప్రకారం వీటికి చెరో సీటు దక్కగా.. వాటిల్లో ఓడిపోయాయి.
డీఎంకే కోసం...
ఓవైసీతో పొత్తుకు డీఎంకే మొదటి నుంచి దూరంగానే ఉంది. ఇందుకు కారణాలూ లేకపోలేదు. ఓవైసీని డీఎంకే బయటి వ్యక్తిగా పరిగణిస్తుంది. అదే సమయంలో ఆయన పార్టీకి భాజపా మద్దతుదారు అన్న పేరు కూడా ఉంది. కానీ డీఎంకేతో పొత్తు కుదుర్చుకునేందుకు ఏఐఎంఐఎం విశ్వప్రయత్నాలు చేసింది.
ఇదీ చూడండి:- తమిళనాట 'రాజకీయ శూన్యత' నిజమా? భ్రమా?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓవైసీ పార్టీ.. తొలుత 40 స్థానాల్లో బరిలో దిగాలని యోచించింది. కానీ భాజపాకు వ్యతిరేకంగా..డీఎంకే సాగిస్తున్న పోరును చూసి ప్రణాళికలు మార్చుకుంది. స్టాలిన్ పార్టీతో పొత్తు కుదుర్చుకుంటే తమిళనాడు రాజకీయాల్లో పార్టీ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని భావించింది.
ఇందుకోసం ఏఐఎంఐఎం విపరీతంగా కృషి చేసింది. కానీ డీఎంకే నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం వల్ల.. ఏఎంఎంకే తలుపు తట్టింది ఓవైసీ పార్టీ.
ఓవైసీ ప్రభావం ఎంత?
ఏఐఎంఎల్ మినహా.. రాష్ట్రంలో ఉన్న ముస్లిం పార్టీలు.. కేవలం స్థానికంగానే పేరు తెచ్చుకున్నాయి. వీటితో డీఎంకే, అన్నాడీఎంకే ఎన్నో ఏళ్లుగా రాజకీయాలు నడుపుతున్నాయి. అయితే ఓవైసీకి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇటీవల బిహార్‌లో ఆ పార్టీ మంచి ప్రదర్శన చేసింది. ఫలితంగా.. ముస్లిం ఓటర్ల ప్రాబల్యం ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో 'ఓవైసీ' అస్త్రం ఉపయోగపడే అవకాశముంది. ఇది ఏఎంఎంకేకు కూడా లాభిస్తుంది. ఓట్ల శాతాన్ని పెంచుకోవచ్చు. ఏఎంఎంకే- ఏఐఎంఐఎం ప్రభావం చూపితే.. అది అధికార అన్నాడీఎంకేకు నష్టం చేస్తుంది.
అయితే.. రాష్ట్రంలో ఓవైసీ ఒక్కసారిగా ప్రభావం చూపలేకపోవచ్చు. దీనికి కొంత సమయం పట్టే అవకాశముంది. తమిళనాడులో ఓవైసీ ప్రభావంపై స్పష్టత రావాలంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు(మే 2) కోసం వేచిచూడాల్సిందే.
--- ఆర్ ప్రిన్స్ జెబాకుమార్, ఈటీవీ భారత్.