ఉత్తర భారత దేశాన్ని రాహుల్ గాంధీ కించపరిచారన్న భాజపా నాయకుల ఆరోపణలపై కాంగ్రెస్ స్పందించింది. దేశంలో ఉన్న అసలైన సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని తమ నాయకుడు పిలుపునిచ్చారని వివరణ ఇచ్చింది. దేశాన్ని ఉత్తర, దక్షిణాలుగా విభజించే టూల్‌కిట్‌ను భాజపా ప్రస్తుతం విక్రయిస్తోందని ఎద్దేవా చేసింది.
కేరళ తిరువనంతపురంలో మంగళవారం చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.."గత పదిహేనేళ్లుగా ఉత్తర భారతం నుంచే ఎంపీగా ఎన్నికయ్యాను. అక్కడ విభిన్నమైన రాజకీయాలకు అలవాటు పడ్డాను. కానీ కేరళకు వస్తే నా మనసు తేలికవుతుంది. ఇక్కడ ప్రజలు అనవసర అంశాలపై గాక అసలైన సమస్యల గురించి ఆలోచిస్తారు." అని అన్నారు. దీనిపై కేంద్ర మంత్రులతో సహా పలువురు భాజపా నేతలు విమర్శలు గుప్పించారు.
రోజుకో నాటకీయ అంశం..
భాజపా నేతల విమర్శలపై స్పందించిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా.. దేశాన్ని తప్పుదోవ పట్టించడానికి అధికార పక్షం రోజుకో అంశాన్ని తెరపైకి తీసుకొస్తోందని దుయ్యబట్టారు. ప్రజలను సమస్యలపై ఆలోచించకుండా ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర భాజపా నేతలు.. ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు.
రాజ్యాంగ వ్యవస్థపై దాడి, భావప్రకటన స్వేచ్ఛ, రైతులు, జీడీపీ, చిన్నతరహా పరిశ్రమల పతనం వంటి అనేక సమస్యలు దేశంలో ఉన్నాయి. వీటన్నింటి నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి భాజపా రోజుకో నాటకీయ అంశాన్ని తెరపైకి తెస్తోంది. దేశంలో ఉన్న అసలైన సమస్యలపై ప్రజలు తమ గళాలను వినిపించాలి.
- రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
ఇదీ చదవండి:తృణమూల్ కార్యకర్తలపై బాంబు దాడి- ఒకరు మృతి