Supertech twin tower demolition: ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలోని 40 అంతస్తుల జంట భవంతుల(ట్విన్ టవర్స్) కూల్చివేత ప్రక్రియ ప్రారంభించాలని దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లోగా ఈ పని మొదలుపెట్టాలని స్పష్టం చేసింది. అక్రమంగా నిర్మించిన ఈ భవనాలను కూల్చివేసేందుకు 72 గంటల వ్యవధిలో సంబంధిత ఏజెన్సీలతో సమావేశం కావాలని నోయిడా సీఈఓకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం, భవనాల కూల్చివేతకు సమయాన్ని నిర్ణయించాలని స్పష్టం చేసింది.
Noida twin tower SC verdict:
ఈ భవనాల కూల్చివేతపై సుప్రీం గతేడాది ఆగస్టు 21న ఇదే తీర్పు చెప్పింది. నిర్మాణ సంస్థ సూపర్‌టెక్.. ఎమరాల్డ్ కోర్టు ప్రాజెక్టులో భాగంగా 40 అంతస్తుల జంట భవనాలను నిర్మించింది. ఈ భవనాలను కూల్చివేయాలని 2014 ఏప్రిల్ 11న అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సూపర్‌టెక్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చింది.
noida twin towers supertech
మూడు నెలల్లోగా కూల్చివేత ప్రారంభించాలని ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు నిర్మాణ సంస్థపై జనవరి 12న ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం. కోర్టు సమయాన్ని వృథా చేస్తే.. జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
noida twin towers case
జంట భవనాల్లోని 915 గృహాలు, దుకాణాలను నోయిడా అథారిటీ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించారని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ భవనాల్లో ఫ్లాట్లు, దుకాణాలను కొనుగోలు చేసిన వారికి బుకింగ్ చేసుకున్న తేదీ నుంచి 12 శాతం వడ్డీతో తిరిగి డబ్బులు చెల్లించాలని ఆదేశించింది. ఈ జంట భవనాల నిర్మాణం జరిపి అక్కడి గృహ సంక్షేమ సంఘాన్ని వేధింపులకు గురి చేసినందుకుగాను 2కోట్ల రూపాయలను సూపర్‌టెక్ పరిహారంగా చెల్లించాలని సూచించింది. భవనాల కూల్చివేత ఖర్చును మొత్తం సూపర్‌టెక్ సంస్థ నుంచే వసూలు చేయాలని నోయిడా అథారిటీకి సుప్రీం ధర్మాసనం సూచించింది.
ఇదీ చదవండి: జడ్ కేటగిరీ భద్రత స్వీకరించండి.. ఒవైసీకి షా విజ్ఞప్తి