దీపావళి సమీపిస్తున్న తరుణంలో దేశంలో బాణసంచాపై పూర్తి స్థాయిలో నిషేధం విధించలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బేరియం సాల్ట్ ఉపయోగించిన టాపాసులకు మాత్రమే అనుమతి ఇవ్వొద్దని ఆదేశించినట్ల శుక్రవారం పేర్కొంది. ఉత్సవాల పేరుతో పర్యావరణానికి హానికరమైన బాణాసంచా కాల్చడానికి వీల్లేదని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఏ ఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం తేల్చిచేప్పింది. కోర్టు ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
వేడుకల పేరుతో ఇతరుల ఆరోగ్యానికి హాని తలపెట్టడం సరికాదని తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 21 ప్రకారం ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే అధికారం ఎవరికీ లేదని తెల్చిచెప్పింది. ప్రత్యేకించి సీనియర్ సిటిజెన్లను దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది. హరిత టపాసులకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది.
కాలుష్య కారక బాణసంచా ఉపయోగించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సుప్రీం కోర్టు సూచించింది. దీనిపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, కేబుల్ టీవీల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని చెప్పింది. లేకపోతే తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొంది.