సరిహద్దులో భారత్-చైనా బలగాల ఉపసంహరణ ఒప్పందంలో భాగంగా మన భూభాగంలో ఒక్క అంగుళం కూడా వదులుకోలేదని విదేశీ వ్యవహారాల తెలిపింది. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి ఏక పక్ష నిర్ణయం తీసుకోకుండా, యథాతథ స్థితిలో మార్పు చేయకుండా చైనాను ఒప్పించామని వెల్లడించింది.
పరస్పర అంగీకారంతోనే..
వాస్తవాధీన రేఖపై భారత విధానంలో ఎటువంటి మార్పు ఉండదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు. గల్వాన్ లోయ నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తైనప్పటికీ.. వాస్తవాధీన రేఖ వద్ద బలగాల మోహరింపు కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీనిని తప్పుగా చిత్రీకరించొద్దని సూచించారు. యథాతథ స్థితిపై మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారం ప్రసారమైన నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు.
లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో బలగాల ఉపసంహరణ ప్రక్రియపై భారత వైఖరిని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారని శ్రీవాస్తవ గుర్తు చేశారు.
అయితే సరిహద్దుల్లో తేలాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి. ఉద్రిక్తతలను తగ్గించేందుకు హాట్ స్ప్రింగ్స్ సహా.. గోగ్రా, దేప్సంగ్ వంటి ప్రాంతాల్లోనూ బలగాల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత్ పట్టుబట్టినట్లు సమాచారం.
ఇదీ చదవండి: 'బలగాల ఉపసంహరణ ఇరువర్గాలకూ ప్రయోజనకరమే'