లైంగిక వేధింపుల కేసులో(Sexual assault case) పదేళ్ల శిక్ష పడిన వ్యక్తిని సంశయ లబ్ధి(బెనిఫిట్ ఆఫ్ డౌట్) కింద మద్రాస్ హైకోర్టు(Madras high court) మదురై ధర్మాసనం నిర్దోషిగా ప్రకటించింది. మొదటిసారి లైంగిక వేధింపుల సమయంలో మహిళ ప్రతిఘటించకపోతే సమ్మతిగా భావించాల్సి ఉంటుందని, ఆ సమ్మతిని తప్పుడు భావనతో చూడలేమని వ్యాఖ్యానించింది. మదురై జిల్లాలోని ఓ గ్రామస్థుడు (అప్పీలుదారు).. తన స్వగ్రామానికి చెందిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో 2016లో మదురై మహిళా కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది. అప్పీలు పిటిషన్ విచారణలో భాగంగా న్యాయమూర్తి జస్టిస్ ఆర్.పొంగియప్పన్ మాట్లాడారు.
"ఫిర్యాదు చేసిన మహిళ ట్రయల్ కోర్టులో విచారణ సందర్భంగా ఆ వ్యక్తితో ప్రేమలో పడ్డానని, క్రమం తప్పకుండా అతన్ని కలిసేదాన్నని పేర్కొంది. పెళ్లి చేసుకోవడానికి సమయం పడుతుందని, గర్భస్రావం చేయించుకోవాలని ఆ వ్యక్తి చెప్పడం వల్లే మహిళ కేసు పెట్టింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని అప్పీలుదారు కచ్చితమైన తేదీ లేదా సమయమిచ్చినట్లు ఆధారాలు లేవు"
-జస్టిస్ ఆర్.పొంగియప్పన్, న్యాయమూర్తి
మహిళ తప్పుడు ఆలోచనతో, విరక్తితో కోర్టును ఆశ్రయించిందని.. ఈ విషయంపై కోర్టుకు అనేక సందేహాలున్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కారణంగా అప్పీలుదారును నిర్దోషిగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: చిన్న పిల్లల బుగ్గ గిల్లడం నేరమా?.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు