పరారీలో ఉండి, అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్న (Param Bir Singh latest news) ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఎక్కడున్నారో చెప్పనంత వరకు ఆయనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది. అప్పటివరకు ఆయన వ్యాజ్యంపై విచారణ కూడా జరపబోమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబర్ 22కు వాయిదా వేసింది. పరంబీర్ సింగ్ తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.
'అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మీరు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. ఒకవేళ విదేశాలలో ఉంటే ఎలా? అదే నిజమైతే ముందు భారత్‌కు వస్తే న్యాయస్థానం మీకు సహకరిస్తుంది. మీరు ఏం ఆలోచిస్తున్నారో తెలియదు? ఎక్కడున్నారో తెలిపే వరకు భద్రతగానీ, ఈ వ్యాజ్యంపై విచారణగానీ చేపట్టబోము.' అని పరంబీర్ సింగ్‌ను ఉద్దేశిస్తూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పరారీలోని నేరస్థులుగా..
బలవంతపు వసూళ్ల కేసులో (Mumbai Police extortion) ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ సహా మరికొంత మంది పోలీసులను పరారీలోని నేరస్థులుగా మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం ప్రకటించింది. చివరిసారిగా సింగ్ మే నెలలో తన కార్యాలయంలో విధులు నిర్వహించారు. తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రూ.15 కోట్ల కోసం పరంబీర్ సింగ్, మరో ఐదుగురు పోలీసు అధికారులు తనను వేధించారని జులైలో మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ముంబయి పోలీసులు పరంబీర్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. అయినా ఆచూకీ దొరకలేదు.
అనిల్ దేశ్‌ముఖ్‌కు చుక్కెదురు..
మరోవైపు.. అవినీతి కేసులో ప్రాథమిక విచారణ (పీఈ) నివేదికకు సంబంధించిన ఫైల్ నోట్స్, అంతర్గత కరస్పాండెన్స్‌తో సహా రికార్డులను కోరుతూ మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. ఈ విషయంపై తగిన న్యాయస్థానంలో పోరాడవచ్చని, అలా చేయడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని పేర్కొంది.
ఇదీ చదవండి: 'బాలిక దుస్తుల పైనుంచి శరీర భాగాలు తాకడం లైంగిక వేధింపే'