భారత్‌కు వచ్చే ఐదేళ్లలోపు చిన్నారులకు కరోనా పరీక్షల నుంచి ప్రభుత్వం మినహాయింపు వచ్చింది. ఇకపై వారికి ప్రయాణానికి ముందు లేదా భారత్ చేరుకున్నాక కరోనా పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉండదు. ఈ మేరకు అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలపై గురువారం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు(guidelines on international travel) జారీచేసింది. ఒకవేళ దేశంలోకి వచ్చాక లేదా హోం క్వారంటైన్(home quarantine guidelines) సమయంలో కరోనా లక్షణాలు వెలుగుచూస్తే మాత్రం చిన్నారులకు పరీక్షలు చేయించాలి. పాజిటివ్ అని వెల్లడైతే.. ప్రస్తుతం అమల్లో ఉన్న విధి విధానాల ప్రకారం చికిత్స చేయించాల్సి ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
"భారత్ రావడానికి ముందు, భారత్ వచ్చాక కరోనా పరీక్షలు(Corona test) చేయించుకోవడం నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు మినహాయింపు ఇస్తున్నాం. ఒకవేళ వారిలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించి, అవసరమైతే చికిత్స అందించాలి" అని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు కొనసాగుతాయని వెల్లడించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదిత కొవిడ్-19 టీకాల విషయంలో భారత్ పరస్పర సర్దుబాట్లు చేసుకున్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు పూర్తిస్థాయిలో (రెండు డోసులు) టీకా(Corona vaccine) తీసుకుంటే వారిని విమానాశ్రయం నుంచి నేరుగా వెళ్లిపోవడానికి అనుమతిస్తారు. క్వారంటైన్ అవసరం లేదు. అదే సమయంలో వారు.. దేశంలోకి ప్రవేశించిన తర్వాత 14 రోజులపాటు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాల్సి ఉంటుంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు భారత్‌లో క్వారంటైన్ మినహాయింపు కోసం.. రెండు డోసుల టీకా తీసుకున్న తర్వాత 15 రోజులు పూర్తవ్వాలన్న నిబంధన మాత్రం కొనసాగుతుంది.
ఒకవేళ టీకాలు తీసుకోని లేదా ఒక డోసు టీకా(Covid-19 vaccine) మాత్రమే తీసుకున్న ప్రయాణికులు విమానాశ్రయంలో పరీక్ష నిమిత్తం నమూనా ఇవ్వాలి. అనంతరం ఇంటికి వెళ్లి ఏడు రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. ఎనిమిదో రోజు మళ్లీ పరీక్ష చేయించుకోవాలి. రెండు పరీక్షల్లో నెగెటివ్ వస్తే మరో వారం రోజులు ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాల్సి ఉంటుంది.
ఇదీ చూడండి: దేశీయ విమాన ప్రయాణాలపై కేంద్రం కీలక నిర్ణయం