వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి.. నెలకు 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందజేస్తామంటూ దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind kejriwal) హామీ ఇచ్చారు. ఆయన దేహ్రాదూన్‌లో ఆదివారం పర్యటించారు. అయితే ఆయన ఇక్కడికి రావడం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ బిల్లుల బకాయిలను సైతం రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల పంజాబ్‌లోనూ ఆయన ఇదే తరహా హామీలు ఇవ్వడం గమనార్హం.
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా, కాంగ్రెస్‌లపైనా కేజ్రీవాల్ ఘాటు విమర్శలు చేశారు. ఒకరి తర్వాత ఒకరు రాష్ట్రాన్ని దోచుకోవడమే ఆ రెండు పార్టీల ప్రధాన ఉద్దేశమంటూ మండిపడ్డారు. ఉత్తరాఖండ్‌లో అధికార పార్టీకి సరైన ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా లేరంటూ ఎద్దేవా చేశారు. సరైన నాయకత్వం కోసం రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలు సైతం దిల్లీ పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారంటూ విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. ప్రజల అభ్యున్నతిపై కాకుండా అధికారంపై ఆ పార్టీలన్నీ దృష్టి పెట్టాయని ఆరోపించారు.
అంతకుముందు రోజు కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా కేజ్రీవాల్ విమర్శనాస్త్రాలు సంధించారు. విద్యుత్ ఉత్పత్తి చేసి ఇతర రాష్ట్రాలకు సైతం సరఫరా చేసే రాష్ట్రంలో కరెంటు కోతలు విధించడం ఇక్కడి నేతల చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నప్పటికీ దిల్లీలో ఉచితంగా విద్యుత్ అందజేస్తున్నామని తెలిపారు.
ఇదీ చదవండి:'ఆ రాష్ట్రంలో అందరికీ కరెంట్ ఫ్రీ!'