కాంగ్రెస్లో గ్రూపులు లేవని పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ బుధవారం పేర్కొన్నారు. ఒక కేంద్రపాలిత ప్రాంతం, 4 రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కలిసికట్టుగా నిలిచి భాజపా, ఇతర ప్రత్యర్థులపై పోరాడుతుందన్నారు. పార్టీని వ్యవస్థాగతంగా పునరుద్ధరించాలంటూ గతంలో సోనియా గాంధీకి లేఖ రాసిన '23 మంది గ్రూపు'లో కీలక సభ్యుడైన ఆనంద్ శర్మ దిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
"కాంగ్రెస్లో 2 గ్రూపులు లేవు. ఒకటే పార్టీ. అద్యక్షురాలు సోనియాగాంధీ. ఎన్నికల్లో కాంగ్రెస్ కలిసికట్టుగా పోరాడదనే తప్పుడు అభిప్రాయం కల్పించొద్దు" అని అన్నారు. కేరళలో సీనియర్ నేత పీసీ చాకో 'గ్రూపిజం' కారణంగానే పార్టీకీ రాజీనామా చేసిన విషయాన్ని ప్రస్తావించగా దీనిపై ఆనంద్ శర్మ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుందని.. అనేక అంశాలపై పార్టీలో చర్చిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి:'పంజరంలో బందీగా మారిన 'కాగ్''