గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబేను పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఎన్‌కౌంటర్ చేశారనేదానిపై ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య విచారణ కమిషన్ తేల్చిచెప్పింది. ఉత్తరప్రదేశ్ పోలీసులకు క్లీన్‌చిట్ ఇచ్చింది. పోలీసులు కావాలనే ఇలా చేశారని పిటిషన్ దాఖలు చేసినవారు ఎలాంటి ఆధారాలు సమర్పించనందున వారిని మందలించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో మోస్ట్ వాంటెడ్ నేరస్థుడిగా ఉన్న వికాస్ దుబేను అరెస్టు చేసేందుకు గతేడాది పోలీసులు కాన్పుర్ వెళ్లగా దుబే, అతడి అనుచరులు పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఎనిమిది మంది పోలీసులు మృతిచెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
కొద్ది రోజుల అనంతరం దుబేను అరెస్టు చేసి కాన్పుర్ తరలిస్తుండగా పోలీసు వాహనం బోల్తా పడింది. అయితే వికాస్ దుబే ఓ పోలీసు వద్దనున్న తుపాకీ లాక్కొని పారిపోయే ప్రయత్నం చేశాడని, తప్పని పరిస్థితుల్లో అతడిని ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు ప్రభుత్వానికి తెలియజేశారు.
ఆధారాల్లేవ్...
దుబే ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయని, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు జ్యుడీషియల్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేపట్టిన జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని విచారణ కమిషన్.. పిటిషన్ దాఖలు చేసినవారు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని యూపీ ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది.
"పిటిషన్ దాఖలు చేసిన వారు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు. ఆధారాల సేకరణకు ప్యానెల్ ఎంతో కృషి చేసింది. ఆధారాలు సమర్పించాలని స్థానిక దినపత్రికలను కూడా కోరింది. కానీ ఎవరూ స్పందించలేదు. వికాస్ దుబే భార్య కానీ, ఆయన కుటుంబసభ్యులు కానీ ఎలాంటి ఆధారాలతో ముందుకు రాలేదు. కానీ వారి వాదనలకు వ్యతిరేకంగా పోలీసుల వద్ద తగినన్ని ఆధారాలు ఉన్నాయి" అని విచారణ కమిషన్ వెల్లడించింది. యూపీ పోలీసులకు క్లీన్‌చిట్ ఇస్తున్నట్లు నివేదికలో పేర్కొంది.
ఇదీ చూడండి: వాతావరణ సంక్షోభంపై నేడు మోదీ కీలక ప్రసంగం