తూర్పు లద్దాఖ్‌లోని అన్ని ఘర్షణ ప్రాంతాల నుంచిల పూర్తిస్థాయిలో బలగాల ఉపసంహరణ జరగనిదే వివాదం సద్దుమణగదన్నారు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే. ఈ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా భారత సైన్యం సిద్ధంగా ఉందని చైనాకు గట్టి సందేశాన్ని పంపారు. దేశ ఉత్తర సరిహద్దులో పరిస్థితి నియంత్రణలో ఉందని తెలిపారు. తూర్పు లద్దాఖ్‌లో ఏర్పడిన ఉద్రిక్తతలను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు.
సంసిద్ధంగా దళాలు..
యథాతథ స్థితిలో ఏకపక్ష చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని.. ఈ విషయంలో భారత సైన్యం స్పష్టంగా ఉన్నట్లు ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. ఏప్రిల్ 2020 నాటి పరిస్థితుల పునరుద్ధరణే లక్ష్యంగా.. చైనాతో తదుపరి చర్చలు జరుగుతాయన్నారు. వాస్తవాధీన రేఖ వద్ద ప్రశాంతత కోరుకుంటున్నామని, పరస్పర అంగీకార చర్యలకు సహకరిస్తామన్నారు. ఇదే సమయంలో కీలక ప్రాంతాలను కలిగి ఉన్న దళాలు.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
గతేడాది మే 5న ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తొలగించేందుకు ఘర్షణ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ కోసం ఇప్పటికే 11 విడతల సైనిక చర్చలు జరిగాయి. ఫలితంగా ఉత్తర, దక్షిణ పాంగాంగ్ సరస్సు వెంబడి ఈ ప్రక్రియ పూర్తి కాగా, మిగిలిన ప్రాంతాల్లో ఎలాంటి మార్పు లేదు.
వాయుసేన చీఫ్ సమీక్ష..
తూర్పు లద్దాఖ్ సమీపంలో చైనా దళాల శిక్షణా కార్యక్రమాలు కొనసాగుతోన్న వేళ భారత బలగాల కార్యాచరణ సన్నద్ధతను సమీక్షించారు భారత వైమానిక దళాధిపతి ఆర్కేఎస్ భదౌరియా. చైనా సరిహద్దు వెంబడి లేహ్ ఎయిర్ బేస్ వద్ద కొనసాగుతోన్న చర్యలపై అధికారులు ఆయనకు వివరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇదీ చూడండి: చైనాకు చెక్ పెట్టేలా సరిహద్దులో భారీ ఏర్పాట్లు!