ఇటీవల రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళ పర్యటన సందర్భంగా శుక్రవారం భాజపాపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం సామాన్యుడిని ఇబ్బందికి గురిచేసిన విషయాలను ప్రశ్నించడంలో రాజీపడనని తెలిపారు. వ్యవసాయ చట్టాలను తక్షణం రద్దు చేసి, ప్రత్యామ్నాయ మార్గాలను పార్లమెంటరీ స్థాయి సంఘం ముందు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కొల్లంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి శుక్రవారం నిర్వహించిన ఐశ్వర్య కేరళ యాత్రలో పాల్గొన్న ఖర్గే.. ఈ వ్యాఖ్యలు చేశారు.
"ప్రతిపక్షం అయినందుకు మేము ప్రభుత్వాన్ని విమర్శించట్లేదు. అనవసరంగా నేను కేంద్రాన్ని విమర్శించను. సామాన్యుడిని ఇబ్బందికి గురి చేసే విధంగా ప్రభుత్వం తప్పుడు చర్యలు చేపడుతున్నందుకు విమర్శిస్తున్నాము. రైతుల నిరసనలకు మేము మద్దతు ఇస్తున్నాము. జనవరి 26న జరిగిన ఘర్షణలు.. కేంద్రం తన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి చేసిన ప్రయత్నం. ఖలిస్థానీ, పాకిస్థానీ అంటూ ఆరోపణలు చేస్తూ రైతులను విడగొట్టేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. "
-మల్లికార్జున ఖర్గే, రాజ్యసభ ప్రతిపక్ష నేత
ధరల పెంపు అన్యాయం..
ఇంధన ధరలను పెంచి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. అంతర్జాతీయంగా చమురు ధరలు కనిష్ఠానికి చేరుకుంటున్న సమయంలో ధరలు పెంచుతున్నారని పేర్కొన్నారు. రోజూ ధరలు పెంచుతూ దేశప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కేరళ ప్రభుత్వం కూడా ఇంధనంపై ఉన్న పన్నులను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : భాగ్యనగరి కీర్తి సిగలో మరో కలికితురాయి