Nirmala Sitharaman On Congress: ప్రస్తుతం దేశంలో అమృతకాలం కొనసాగుతుండగా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం రాహుకాలం ఉందన్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. 2014 నుంచి దేశంలో రాహుకాలం కొనసాగుతోందన్న కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్ వ్యాఖ్యలపై రాజ్యసభలో స్పందించారు నిర్మల. యూపీఏ పాలనలోనే దేశంలో రాహుకాలం కొనసాగిందని, కాంగ్రెస్ హయాంలో దేశంలో పెద్ద పెద్ద స్కామ్‌లు జరిగాయని ఆరోపించారు.
"కాంగ్రెస్‌కు రాహుకాలం జీ23 రూపంలో ఉంది. మన అమృత కాలం కాంగ్రెస్‌కు రాహుకాలం. కాంగ్రెస్నుం చి సీనియర్లు వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్‌కు గత ఎన్నికల్లో 44 సీట్లు వచ్చాయి. అందుకే అది రాహుకాలంలో ఉందనటంలో అతిశయోక్తి లేదు. దేశంలోని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాహుకాలం కొనసాగుతోంది. అక్కడ రోజూ ఏదో ఒక స్కాం బయటపడుతోంది."
-- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థికమంత్రి
వచ్చే 25 ఏళ్లు దేశానికి ఎంతో ముఖ్యమైనవని తెలిపారు నిర్మల. ప్రస్తుతం దేశం అమృతకాలంలో ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు. స్వాతంత్య్రం వచ్చాక మొదటి 65 ఏళ్లు దూరదృష్టి లేకుండా కేవలం కుటుంబ పాలనకే పరిమితమైందని మండిపడ్డారు.
తమ బడ్జెట్ ఆర్థిక రంగ బలోపేతం, ఉపాధి కల్పనకు తోడ్పడుతుందన్నారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. నిర్మల పేదలను ఎగతాళి చేశారని ఆరోపణలు చేసిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదికి బదులిచ్చారు. "నేను పేదలను ఎగతాళి చేయలేదు. పేద ప్రజలను ఎగతాళి చేస్తూ మాట్లాడిన వాళ్లు మీ కూటమిలోనే ఉన్నారు" అని నిర్మల అన్నారు. పేదరికంపై గతంలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఇదీ చూడండి: శశిథరూర్ ట్వీట్‌లో అక్షర దోషాలు.. కేంద్రమంత్రి సెటైర్లు