ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఇంటి(యాంటిలియా) సమీపంలో పేలుడు పదార్థాల కేసుపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణ ప్రారంభించింది. కారు లభ్యమైన ప్రదేశాన్ని ఎన్ఐఏ బృందం బుధవారం సందర్శించింది.
ఫిబ్రవరి 25న జరిగిన ఈ ఘటనకు సంబంధించి గామ్దేవి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్(నం: 35/2020) నమోదైంది. దర్యాప్తు బాధ్యతలు ఎన్ఐఏకు అప్పగిస్తూ ఆ రాష్ట్ర హోం శాఖ సోమవారం ఆదేశాలిచ్చింది. అయితే.. ఈ పేలుడు పదార్థాల రికవరీ కేసును ఎన్ఐఏ పరిశీలిస్తుందని.. మన్‌సుఖ్ హిరేన్(వాహన యజమాని) మరణ కేసును యాంటీ టెర్రరిజమ్ స్వాడ్(ఏటీఎస్) దర్యాప్తు చేస్తుందని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండి: 'హిరేన్' కేసు: క్రైం బ్రాంచ్ నుంచి సచిన్ తొలగింపు
ఇదీ కేసు..
దక్షిణ ముంబయిలోని అంబానీ ఇంటి వద్ద.. ఫిబ్రవరి 25న జిలెటిన్ స్టిక్స్‌తో ఓ వాహనాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ తర్వాత కారును పార్క్ చేసిన నిందితుడి దృశ్యాలు అక్కడి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సేకరించారు పోలీసులు. అయితే.. ఆ సమయంలో ముఖానికి మాస్క్ సహా తలభాగం మొత్తం హుడీతో కప్పి ఉండటం వల్ల.. అతణ్ని గుర్తించలేకపోయారని పోలీసులు తెలిపారు.
అనంతరం.. ఆ వాహనం తనదేనని, వారం రోజుల క్రితం అది చోరీకి గురైందని ఠాణేకు చెందిన మన్‌సుఖ్ హిరేన్ తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన అదృశ్యమై.. సముద్రపు పాయలో శవమై తేలారు. అయితే.. ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావించారు. ఈ కేసుపై మహారాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఈ కేసును ఎన్ఐఏతో విచారణ జరిపించాలని ఆ రాష్ట్ర మాజీ సీఎం, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ సహా.. ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
ఇదీ చదవండి: అంబానీ ఇంటి వద్ద కలకలం- లేఖలో తీవ్ర హెచ్చరికలు