లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. వీరంతా గతేడాది జూన్‌లో మాదకద్రవ్యాల సరఫరా కేసులో పట్టుబడిన నిందితులుగా ఎన్ఐఏ పేర్కొంది.
గతేడాది జూన్‌లో 21కేజీల హెరాయిన్ సహా.. రూ. 1.35 కోట్ల నగదు పట్టుబడ్డ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం అందిన పక్కా సమాచారంతో వీరిని పట్టుకున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. వీరంతా జమ్ముకశ్మీర్ వ్యాప్తంగా మాదకద్రవ్యాల సరఫరా ముఠాగా ఏర్పడ్డారని తెలిపింది.
పట్టుబడిన వారిని అల్తాఫ్ అహ్మద్ షా, షౌకత్ అహ్మద్ ప్యారీ, ముదస్సిర్ అహ్మద్ దార్, అమిన్ అల్లీలుగా గుర్తించారు.
పాక్‌కు రహస్య సమాచారం..
నిందితులంతా లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహుద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థలతో రహస్యంగా ఛాటింగ్ చేస్తూ.. సమాచారాన్ని చేరవేస్తున్నట్లు గుర్తించారు. నిషేధిత సంస్థలతో సంప్రదింపులు జరుపుతూ కశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారని ఎన్ఐఏ తెలిపింది. ఈ ముఠా కార్యకలాపాలపై గతేడాది జూన్‌లోనే కేసు నమోదు చేసిన ఎన్ఐఏ.. డిసెంబర్లో ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.
నిందితులకు శ్రీనగర్ కోర్టు మూడురోజుల రిమాండ్ విధించింది. దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలుస్తాయని ఎన్ఐఏ అధికారి ఒకరు వివరించారు.
ఇదీ చదవండి: పుల్వామా దాడి: పాక్‌లో వ్యూహం- అఫ్గాన్‌లో శిక్షణ