బంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై అధ్యయనం చేసిన జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ).. తమ నివేదికను బహిర్గతం చేయడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుకు ఇవ్వాల్సిన లేఖను మీడియాకు లీక్ చేయడమేంటని ప్రశ్నించారు. ఎన్హెచ్ఆర్సీ కోర్టు ఆదేశాలను ధిక్కరించిందని ఆరోపించారు. భాజపా చేసిన రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగానే నివేదిక లీకైందని మమత అన్నారు.
"బంగాల్ పేరు చెడగొట్టేందుకు, రాజకీయంగా ప్రతీకారం తీర్చుకునేందుకు నిష్పక్షపాత సంస్థలను కూడా భాజపా ఉపయోగించుకుంటోంది. ఎన్హెచ్ఆర్సీ.. కోర్టు అధికారాలను గౌరవించి ఉంటే బాగుండేది. మీడియాకు లీక్ చేయడానికి బదులు నివేదికను కోర్టుకు సమర్పించాల్సింది."
--మమతా బెనర్జీ, బంగాల్ సీఎం.
బంగాల్ ఎన్నికల తర్వాత జరిగిన హత్య, అత్యాచారం ఘటనలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోల్‌కతా హైకోర్టుకు సమర్పించిన నివేదికలో ఎన్హెచ్ఆర్సీ ప్రతిపాదించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మమత.. యూపీలో జరిగిన ఘటనలపై ఎన్ని కమిటీలు వేశారని ప్రశ్నించారు.
బంగాల్‌కు నిధులు, వ్యాక్సిన్లు ఇవ్వకపోవడం అన్యాయమని మమత అరోపించారు. 14 కోట్ల టీకాలు అవసరమైతే 2 కోట్ల డోసులే పంపారని కేంద్రంపై ధ్వజమెత్తారు. టీకాల విషయంలోనూ వివక్ష చూపడం సరికాదని అన్నారు.
దిల్లీ పర్యటన
వచ్చే వారం దిల్లీ పర్యటిస్తానన్న మమత.. అవకాశమొస్తే ప్రధాని మోదీని, రాష్ట్రపతిని కలుస్తానని తెలిపారు. ఎప్పటిలాగే ఎన్నికల అనంతరం.. కొందరు మిత్రులను కలిసేందుకు తప్పనిసరిగా దిల్లీ వెళ్తానని చెప్పారు. కొవిడ్ పరిస్థితులు అదుపులో ఉన్న కారణంగా కొన్ని రోజులు దిల్లీలోనే ఉంటానని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: