'తల్లి మరణ వార్త విన్నప్పటికీ బ్యాటింగ్ చేసి టీమ్‌ని గెలిపించిన క్రికెటర్'.. లాంటి వార్తలు అప్పుడప్పుడూ పేపర్లో చదువుతుంటాం. అంతటి బాధను దిగమింగుకుని వారు చూపిన తెగువను ఆకాశానికి ఎత్తేస్తూంటాం. అయితే.. అవే వార్తాపత్రికలు పంపిణీ చేసే ఓ వ్యక్తి(పేపర్ బాయ్) అదే పని చేశాడు. తన తల్లి మరణించినప్పటికీ ఉదయాన్నే తాను చేయాల్సిన పనిని పూర్తి చేసి.. అంత్యక్రియలకు హాజరయ్యాడు.
ఇదీ జరిగింది..
కర్ణాటకలోని హవేరికి చెందిన సంజయ్ మల్లప్ప అనే వ్యక్తి వార్తాపత్రికలు ఇంటింటికి పంచే పనిచేస్తున్నాడు. రోజూలాగే నేటి తెల్లవారుజామున పేపర్ పంపిణీకి బయలుదేరాల్సిన అతనికి తన తల్లి శాంతవ్వ(78) మరణ వార్త తెలిసింది. ఆ సమయంలో తన పని పట్ల అంకితభావంతో పేపర్ పంపిణీకే మొగ్గుచూపాడు సంజయ్.
విజయ కర్ణాటక, ముదానా, లోకదర్శన, కన్నడమ్మ వంటి పలు వార్తాపత్రికలను చేరవేస్తుంటాడు సంజయ్. రోజూ ఆలస్యం చేయకుండా పేపర్ అందిస్తుంటాడు. తల్లి మరణం రోజు కూడా సంజయ్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన తీరు పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.
సెలవు తీసుకొమ్మని చెప్పినప్పటికీ 'రెండు గంటల్లో పని ముగించుకుని వెళ్లి నా తల్లి అంత్యక్రియలను పూర్తి చేస్తాన'ని సంజయ్ చెప్పినట్లు అతని యజమాని తెలిపారు.
ఇవీ చదవండి: సింగర్ అర్జిత్ సింగ్‌కు మాతృవియోగం