కాసేపు కరెంట్ పోయి చీకటి కమ్మేస్తే.. ప్రాణం పోయినట్లు బాధపడతాం.. కళ్లు నలుపుకుంటూ చీకటిని దాటి చూసే ప్రయత్నం చేస్తాం. మరి.. ప్రమాదవశాత్తు కళ్లు పోగొట్టుకున్నవారికి జీవితాంతం చీకటే కదా!. అలాంటివారి బాధను అర్థం చేసుకున్న కర్ణాటకకు చెందిన ఓ నూతన వధూవరులు.. తమ వివాహ వేడుకలోనే నేత్రదానం చేశారు. మరణానంతరం కళ్లను దానం చేస్తామని డొనేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.
కర్ణాటక హుబ్లీకి చెందిన సుచిత్ మరణానంతరం (eye donation in karnataka) కూడా ఇతరులకు సహాయపడాలనే తపన గల వ్యక్తి. తన వివాహ వేడుకలోనే నేత్రాలను దానం చేయాలని నిశ్చయించుకున్నాడు. అందుకు వధువు తరఫువారిని కూడా ఒప్పించగలిగాడు. వధూవరులిద్దరూ పెళ్లిలోనే నేత్రదానం చేశారు. తమ కుటుంబ సభ్యులను కూడా నేత్రదానం చేసేలా ఒప్పించారు. ఏకంగా ఫంక్షన్ హాల్లోనే నేత్రదాన శిబిరం నిర్వహించి.. పెళ్లికి వచ్చిన అతిథులను కూడా పోత్సహించారు.
"నేత్రదానం చేయడానికి మా కుటుంబ సభ్యులందరూ ఒప్పుకున్నారు. డొనేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అంతేకాకుండా మా పెళ్లిలోనే నేత్రదాన శిబిరం కూడా నిర్వహించాం. కుటుంబ సహకారం ఉన్నందుకు ఆనందంగా ఉంది."
- సుచిత్, పెళ్లి కుమారుడు
"చనిపోగానే శరీరంతో పాటే కళ్లను కూడా మట్టిలో కప్పిపెట్టేస్తారు. మరణించిన తర్వాత నేత్రదానం చేస్తే.. అవి ఎందరికో ఉపయోగపడతాయి. అంధులు లేని సమాజాన్ని తయారు చేయవచ్చు. నేత్రాలు దానం చేయడానికి ముందడుగు వేయండి."
-డా. శ్రీనివాస్ జోషి, నేత్ర వైద్యుడు
కర్ణాటక ప్రముఖ నటుడు పునీత్ కుమార్ నేత్రదానం తర్వాత కర్ణాటకలో.. మరణానంతరం కళ్లను దానం చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. పునీత్ నేత్రదానం నలుగురికి జీవితాన్ని ఇచ్చిందని కర్ణాటక ఆరోగ్య మంత్రి కే. సుధాకర్ మంగళవారం తెలిపారు. నేత్రదానం ఓ ఉద్యమంగా సాగాలని కోరారు. చనిపోయిన తర్వాత కూడా మన కళ్లు మరొకరికి చూపును ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు.
ఇదీ చదవండి:పద్మశ్రీ అందుకున్న ట్రాన్స్జెండర్.. రాష్ట్రపతికి ఆశీస్సులు