పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్లో బేధాభిప్రాయాలు తొలగినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీలోని కీలక నేతలు ఒకేతాటిపైకి వచ్చినట్లు తెలుస్తోంది. నిన్నమొన్నటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న సీఎం అమరిందర్ సింగ్, నూతన పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ.. శుక్రవారం ఒకే వేదికపై కనిపించనున్నారు.
పీసీసీ సారథిగా ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ.. అమరిందర్కు రెండో లేఖ రాశారు సిద్ధూ. ఈ లేఖపై 56 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.
ఇది జరిగిన కాసేపటికే.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా పార్టీ సీనియర్ నేతలను అమరిందర్ తన ఇంటికి ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం అక్కడి నుంచే అందరూ కలిసి పంజాబ్ కాంగ్రెస్ భవన్కు వెళ్దామని సమాచారం ఇచ్చారు. "సీఎం అమరిందర్ సింగ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలను తేనీటి విందుకు ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ వింధు జరిగిన తర్వాత పంజాబ్ కాంగ్రెస్ భవన్కు వెళ్తారు" అని సీఎం ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఒక్కసారిగా మార్పు
కొత్త పీసీసీ సారథి నియామకం తర్వాత సిద్ధూ, అమరిందర్ ఒక్కసారి కూడా కలుసుకోలేదు. అమరిందర్.. సిద్దూకు కనీసం అభినందనలు కూడా తెలపకపోవడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గతంలో చేసిన ట్వీట్లపై సీఎం ఆగ్రహంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో ప్రభుత్వానికి క్షమాపణ చెబితే గానీ.. సిద్ధూను కలిసేది లేదని అమరిందర్ నిర్ణయించుకున్నట్లు వెల్లడించాయి. బుధవారం కూడా సిద్ధూ, అమరిందర్ పోటాపోటీగా ప్రజాప్రతినిధులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. అనూహ్యంగా ఒక్కరోజులోనే రాజీ సంకేతాలు ఇచ్చారు.
ఇదీ చూడండి: కెప్టెన్ x సిద్ధూ: పోటాపోటీ బలప్రదర్శనలు