Telangana New Secretariat Facilities: హైదరాబాద్ నడిబొడ్డున సాగరతీరాన సువిశాల స్థలంలో అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న నయాపాలనాసౌధం నిర్మాణం అద్భుత కట్టడాల్లో ఒకటిగా నిలుస్తోంది. భవంతి ముందు పార్లమెంట్ తరహాలో రెడ్‌శాండ్ స్టోన్‌తో ఏర్పాటుచేసిన ఫౌంటెయిన్, స్వాగత తోరణం, విశాలమైన అంతర్గత రోడ్లు, పార్కింగ్ స్థలాలు, హెలీప్యాడ్, ఉద్యానవనాలు, ప్రార్థనామందిరాలతో సకల సౌకర్యాలతో నిర్మితమైన కట్టడం చూపరులను అబ్బురపరుస్తోంది. ప్రధానంగా సచివాలయంలో పచ్చదనానికి 8 ఎకరాల వరకు కేటాయించారు. అత్యధిక భాగం లాన్స్ రూపంలోనే కనిపించనుంది. ముందుభాగంతో పాటు భవన మధ్య ప్రాంతాన్ని సైతం పచ్చదనంతో పరిచారు. ప్రాంగణానికి మరింత శోభను తీసుకువచ్చేందుకు నలుదిశలా పగోడ, దేవదారు వృక్షాలను పెంచుతున్నారు.
సచివాలయానికి ఇరువైపుల నాలుగు ద్వారాల ఏర్పాటు: సువిశాలమైన రోడ్లు సచివాలయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తూర్పు వైపు ఉన్న ప్రధాన ప్రవేశ ద్వారాన్ని ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల కోసం కేటాయించారు. ఈశాన్యంలో ఉన్న మార్గాన్ని కింది స్థాయి అధికారులు, సిబ్బంది కోసం కేటాయించగా... ఆగ్నేయం వైపు ఏర్పాటు చేసిన గేటు నుంచి సందర్శకులు రావాల్సి ఉంటుంది. వాయవ్యంలో నిర్మించిన ద్వారం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగిస్తారు.
వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలు: సచివాలయ భవనం ముందు శాశ్వత హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించారు. ప్రాంగణంలో కేవలం సీఎం, మంత్రులు, అధికారులు, సిబ్బందికి మాత్రమే పార్కింగ్ సదుపాయం ఉంటుంది. సుమారు రెండున్నర ఎకరాల్లో అధికారులు, సిబ్బందికి చెందిన 560 కార్లు, 720 ద్విచక్ర వాహనాలు, 4 బస్సులు ఏక కాలంలో పార్కింగ్ చేసేందుకు అవకాశం ఉంది. కనీసం 300 కార్లు పట్టేలా ఎకరాన్నర ప్రాంతాన్ని సందర్శకులకు కేటాయించారు. సాధారణ రోజుల్లో రోజుకు 700 నుంచి 800 మంది, అసెంబ్లీ సమావేశాల సమయంలో వెయ్యి మంది వరకు సచివాలయానికి వస్తారన్న మునుపటి గణాంకాల మేరకు ఈ పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు.
ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ప్రార్థన మందిరాలు: పాత సచివాలయంలో కంటే అధిక విస్తీర్ణంలో నూతన సచివాలయంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో దీన్ని కేటాయించారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు వచ్చేలా రెండున్నర వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంటీన్ నిర్మించారు. మరికొంత విస్తీర్ణంలో ఓపెన్ కిచెన్‌ను కూడా సిద్ధం చేశారు. అదే విధంగా మీడియా పాయింట్, బ్యాంకు, ఏటీఎంలు సైతం ఇక్కడే అందుబాటులో ఉండనున్నాయి. సచివాలయంలో గతంలో మాదిరిగానే హిందూ, ముస్లిం, క్రైస్తవ ప్రార్థన మందిరాలను ప్రభుత్వం నిర్మించింది. గతం కంటే విశాలంగా, సుందరంగా వీటిని తీర్చిదిద్దారు. ఆయా మత పెద్దల ఆకాంక్షల మేరకు నిర్మాణాలు చేయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. దేవాలయం, మసీదు, చర్చి కోసం సుమారు తొమ్మిది వేల చదరపు అడుగులు కేటాయించగా... ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా వీటిని తీర్చిదిద్దారు.
పటిష్ఠ భద్రతా వలయంలో సచివాలయ ప్రాంగణం: ఇదిలా ఉండగా... సచివాలయ భద్రతకు ప్రభుత్వం అత్యాధునిక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సీఎం ఆదేశాలమేరకు ఐదంచెల భద్రతను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు భద్రత బాధ్యతను తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్‌కు డీజీపీ అప్పగించారు. ప్రముఖులు, సందర్శకులు నిత్యం రాకపోకలు సాగించే ప్రాంతం అయినందున భద్రతాపరంగా ఎక్కడా ఇబ్బంది లేకుండా పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నారు. సందర్శకుల వివరాలన్నీ భద్రతాధికారుల కంప్యూటర్ తెరపై క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ఆ భద్రతా వలయాన్ని దాటిన తరువాతే ఎవరైనా సచివాలయంలోనికి ప్రవేశించగలరు. నిత్యం సుమారు 650 మందికిపైగా భద్రతా సిబ్బంది పహారా కాయనున్నారు. రాత్రీపగలూ నిరంతరాయంగా పనిచేసే పటిష్ఠమైన సీసీ టీవీల కెమెరా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. సందర్శకుల ముఖ గుర్తింపు ద్వారా వారి సమాచారం ఆధార్ డేటాతో అనుసంధానమవుతుంది. పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నిక్షిప్తమై ఉండే డేటా ద్వారా సందర్శకుని పూర్తి వివరాలు అప్పటికప్పుడే కంప్యూటర్ తెరపై కనిపించే అవకాశం ఉంటుంది.
ఇవీ చదవండి: