New Rules for Social Media in India 2023 for Central Forces : సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న కేంద్ర పోలీసు బలగాలకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ఆన్‌లైన్ స్నేహాల జోలికి వెళ్లొద్దని, సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేయొద్దని.. తమ సిబ్బందిని కేంద్ర పోలీసు బలగాలు హెచ్చరించాయి. వీటి వల్ల హనీట్రాప్‌కు గురయ్యే ముప్పు పెరుగుతుందని తెలిపాయి. దీంతో సున్నితమైన సమాచారం శత్రువులకు చేరుతుందని వెల్లడించాయి.
కొంత మంది సిబ్బంది యూనిఫామ్‌లోనే తమ వీడియోలను సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నట్లు.. ఇటీవల కేంద్ర నిఘా సంస్థలు చేపట్టిన పరిశీలనలో వెల్లడైంది. దాంతోపాటు సున్నితమైన ప్రదేశాల్లో దిగిన ఫొటోలను షేర్ చేయడం, ఆన్‌లైన్‌లో స్నేహితుల కోసం రిక్వెస్ట్‌లు పంపడం వంటి చర్యలను ఆ సంస్థలు గుర్తించాయి. దీనిపై కేంద్ర పారామిలిటరీ, పోలీసు బలగాలకు కేంద్ర నిఘా సంస్థలు లేఖ రాశాయి.
Police Instructed Not Make Reels On Social Media : దీంతో అప్రమత్తమైన పోలీసు బలగాలు.. తమ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశాయి. యూనిఫామ్‌లో ఉన్న వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయొద్దని సూచించాయి. ఆన్‌లైన్‌లో గుర్తుతెలియని వ్యక్తులతో స్నేహం చేయొద్దని స్పష్టం చేశాయి. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించాయి. సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీపీబీ సిబ్బందికి ఈ ఆదేశాలు అందాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బందికి ఈ ఆదేశాలు అందాయి.
దిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోఢా సైతం తమ బలగాలకు ఇలాంటి హెచ్చరికలే జారీ చేశారు. "విధుల్లో నిర్వర్తిస్తున్నప్పుడు సామాజిక మాధ్యమాలను వినియోగించొద్దు. సున్నితమైన సమాచారాన్ని పోస్ట్ చేయకూడదు. యూనిఫామ్‌లో రీల్స్, వీడియోలు చేయడం లాంటి వాటికి దూరంగా ఉండాలి. హై-సెక్యూరిటీ ప్రాంతాలు, ప్రముఖుల వీడియోలు తీయకూడదు." అని హెచ్చరించారు. భద్రతా బలగాల్లో పనిచేస్తున్న వ్యక్తులకు వలపు వల విసిరి.. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
హనీట్రాప్‌లో పడి కొకైన్ స్మగ్లింగ్.. అడ్డంగా బుక్కైన వ్యక్తి.. రూ.28కోట్ల డ్రగ్స్ సీజ్
హనీ ట్రాప్‌లో DRDO సైంటిస్ట్.. 'పాక్' మహిళకు రహస్య క్షిపణి సమాచారం!