అఫ్గానిస్థాన్ సంక్షోభం వల్ల శరణార్థుల(afghan refugee crisis) సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికా బలగాలన్నీ దేశం విడిచి వెళ్లిపోతుండగా.. అఫ్గాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్ల నుంచి తమను తాము రక్షించేందుకు స్థానిక పౌరులు పొరుగు దేశాలకు పయనమయ్యారు. తాలిబన్ల గత పాలనను దృష్టిలో ఉంచుకొని భయాందోళనలతో పెట్టెబేడా సర్దుకోకుండానే ఒట్టిచేతులతో దేశం విడిచి వెళ్తున్నారు. వీరందరికీ వివిధ దేశాలు ఆశ్రయం కల్పిస్తున్నాయి. అందులో భారత్ కూడా ఒకటి(india refugee afghanistan).
అఫ్గానిస్థాన్‌కు సంప్రదాయ భాగస్వామ్య దేశమైన భారత్.. అక్కడి ప్రజలకు అనేక సార్లు ఆశ్రయం(afghan refugees in india) కల్పించింది. వీరే కాదు.. పాక్ నుంచి వచ్చిన మైనారిటీలైనా, టిబెట్ బౌద్ధులైనా, శ్రీలంక తమిళులైనా.. ఆశ్రయం కల్పించాలంటూ దేశంలోకి వచ్చిన సక్రమ వలసదారులెవరికీ వెన్నుచూపలేదు.
అయితే, వలసదారులకు సంబంధించి భారత్ నిర్దిష్ట విధానం(india refugee policy) అంటూ రూపొందించుకోలేదు. శరణార్థులపై ఐరాస రూపొందించిన 1951 యూఎన్ కన్వెన్షన్(1951 refugee convention), 1967 ప్రోటోకాల్‌పై భారత్ సంతకమూ చేయలేదు. దేశంలో శరణార్థుల కోసం ప్రత్యేక చట్టమంటూ ఏదీ లేదు కూడా. అయినప్పటికీ, అనేక మంది శరణార్థులకు భారత్ ఆశ్రయం కల్పిస్తోంది. అఫ్గాన్‌లోని భద్రత, భౌగోళిక రాజకీయ పరిస్థితులను బట్టి.. 1979 నుంచి అక్కడి ప్రజలకు ఆశ్రయం ఇవ్వడం ఆరంభించింది. ఈ నేపథ్యంలో ఓ నిర్దిష్ట పాలసీ అంటూ ఏర్పాటు చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
శరణార్థులకు ఆశ్రయం ఇలా..
శరణార్థుల విషయంలో ఓ విధానం రూపొందించాలన్న ప్రతిపాదనలు ఎప్పటి నుంచో దేశంలో వినిపిస్తున్నాయి. 2019లో పౌరసత్వ చట్టాన్ని(CAA india) సవరించిన సమయంలోనూ ఇలాంటి డిమాండ్లు వినిపించాయి. అఫ్గాన్ నుంచి వచ్చే హిందూ, సిక్కు శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పిస్తామని సవరణ చట్టంలో పేర్కొనడంపై తీవ్ర అభిప్రాయభేదాలు తలెత్తాయి. అయితే, దీనర్థం ఇతర మతాలకు సంబంధించినవారికి ఆశ్రయం కల్పించకుండా ఉండటం కాదని మాజీ దౌత్యవేత్త జితేంద్ర త్రిపాఠి పేర్కొన్నారు.
"పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చిన మైనారిటీ హిందువులు, సిక్కులకు పౌరసత్వం కల్పిస్తామని సీఏఏలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. దీనర్థం.. ఇతర మతాలకు చెందినవారికి దేశంలోకి అనుమతి లేదని కాదు. నిర్దిష్ట కేసును బట్టి.. వారికి దేశంలోకి అనుమతి ఉంటుంది. ప్రస్తుతం అది కొనసాగుతోంది. భారత్ చేపట్టిన తరలింపు ప్రక్రియలో అఫ్గాన్‌లోని హిందువులు మాత్రమే కాదు, ముస్లింలు కూడా భారత్‌కు వచ్చారు. అయితే, భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క శరణార్థిని పూర్తిగా తనిఖీ చేయాలి. శరణార్థుల పేరుతో ఉగ్రవాదులూ భారత్‌లోకి వచ్చినవారు ఉండొచ్చు. ఒక్కో కేసును నిశితంగా పరిశీలించి శరణార్థులను దేశంలోకి అనుమతించాలి."
-జితేంద్ర త్రిపాఠి, మాజీ దౌత్యవేత్త
అధికారం వారిదే!
ఎవరిని శరణార్థులుగా పరిగణించాలనే విషయాన్ని తేల్చే అధికారం వారికి ఆశ్రయమిచ్చే దేశాలదే. ఈ విషయంపై ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన(UNHCR) దేశాలపై ఒత్తిడి చేయదు. రాజకీయ పరిస్థితుల ఆధారంగా దీనిపై దేశాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల భారత్‌కు వచ్చిన వారిలో అఫ్గానిస్థాన్ పార్లమెంట్ సభ్యులు, విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. వీరందరికీ ఇదివరకే భారత వీసాలు ఉన్నాయి.
తరలింపు ప్రక్రియలో భాగంగా 550 మందిని అఫ్గాన్ నుంచి తీసుకొచ్చినట్లు విదేశాంగ శాఖ ఇదివరకు ప్రకటించింది. ఇందులో 260 మంది భారతీయులు, మిగిలిన వారిలో అఫ్గాన్ పౌరులతో పాటు విదేశాలకు చెందినవారు ఉన్నారు.
సాయం కోసం...
మరోవైపు, భారత్‌లో ఆశ్రయం పొందుతున్న పలువురు శరణార్థులు తమకు పౌరసత్వం కల్పించాలని వేడుకుంటున్నారు. తాలిబన్ల అకృత్యాల(taliban atrocities)ను భరించలేక ఇక్కడికి వచ్చిన అనేక మందికి శరణార్థుల ధ్రువీకరణ పత్రాలను అందించాలని కోరుతున్నారు.
"తాలిబన్లకు భయపడి ఐదేళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి అఫ్గాన్ శరణార్థులకు సహాయం చేయాలని యూఎన్‌హెచ్‌సీఆర్‌ను కోరుతున్నాను. అనంతరం వాళ్లు నా కేసు మూసేశారు. నా వీసా గడువు ముగిసిపోయింది. భారత ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఈ-వీసాకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేకపోతున్నాం. చాలా మంది అఫ్గాన్ పౌరులు ఇలాగే సమస్యలు ఎదుర్కొంటున్నారు. భారత ప్రభుత్వం మాత్రమే మాకు సహాయం చేయగలదని భావిస్తున్నాం. చాలా ఏళ్లుగా భారత్‌లోనే ఉంటున్న మాకు పౌరసత్వం ఇవ్వాలని కోరుతున్నాం."
-నిసార్ అహ్మద్ షెర్జాయ్, అఫ్గాన్ శరణార్థి
జులై 2021 నాటికి 15,467 మంది అఫ్గాన్ పౌరులు భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. వీరంతా యూఎన్హెచ్సీఆర్లో రిజిస్టరై ఉన్నారు. మొత్తంగా 25021 జూన్ నాటికి భారత్‌లో 2,08,065 మంది కాందిశీకులు దేశంలో తలదాచుకుంటున్నారు. ఇందులో 95,829 మంది శ్రీలంకన్లు కాగా, 73,404 మంది టిబెటన్లు . ఐరాస శరణార్థుల విభాగం అంచనా ప్రకారం అఫ్గాన్‌లో ఈ ఏడాది 5,50,000 మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.
(చంద్రకళా చౌదరి- ఈటీవీ భారత్ ప్రతినిధి)
ఇదీ చదవండి:
పారిపోతున్న 'గే'పై తాలిబన్ల క్రూరత్వం- రేప్ చేసి మరీ...