New Parliament Building inauguration : భారత పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మే 28న జరిగే వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షత వహించనున్నారు. పార్లమెంట్‌ను జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని రెండు దశలుగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మొదటగా తెల్లవారుజామునే పాత పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పూజ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ క్రతువులో ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సహా పులువురు సీనియర్ మంత్రులు పాల్గొననున్నారు. పూజ అనంతరం వీరంతా లోక్‌సభ, రాజ్యసభ ఛాంబర్లను సందర్శిస్తారు. లోక్‌సభ స్పీకర్ కుర్చీ కుడి పక్కన పెట్టే సెంగోల్ అనే రాజదండాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో పాటు సెంగోల్‌ను రూపకర్తలు సైతం హాజరుకానున్నారు. అనంతరం నూతన పార్లమెంట్ ఆవరణలోనూ పూజలు చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమాలన్నీ ఉదయం 9.30 గంటలలోపే పూర్తి కానున్నట్లు తెలుస్తోంది.
అనంతరం మధ్యాహ్నం సమయంలో జాతీయ గీతాలపనతో రెండో దశ ప్రారంభ వేడుకలు మొదలుకానున్నాయి. లోక్‌సభ ఛాంబర్లో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా అతిథులు హాజరుకానున్నారు. ఆ తర్వాత రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ప్రసంగిస్తారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడతారు. తర్వాత పార్లమెంట్ నిర్మాణం సమయంలోని అనేక ఘట్టాలతో రూపొందించిన వీడియోలను ప్రదర్శించనున్నారు. తర్వాత లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగిస్తారు. స్పీకర్ ప్రసంగం అనంతరం రాజ్యసభలో ప్రతిపక్ష నేత మాట్లాడానికి సమయాన్ని కేటయించినట్లు తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన నేపథ్యంలో మల్లిఖార్జున ఖర్గే ఈ వేడుకకు హాజరుకావట్లేదు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రూపొందించిన నాణెం, స్టాంపులను విడుదల చేసి ప్రసంగించనున్నారు. మోదీ ప్రసంగం అనంతరం లోక్‌సభ కార్యదర్శి ధన్యవాద ప్రసంగం చేయనున్నారు.
ప్రతిపక్షాలు దూరం..
ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపించారు. పార్లమెంట్ భవన ఆర్కిటెక్ట్ బీమా పటేల్, నిర్మాణ సంస్థ టాటాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటాను సైతం ఆహ్వానించారు. అయితే, పార్లమెంటు నూతన భవనాన్ని రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి ప్రారంభించనుండటాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నెల 28న జరగబోయే ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ 19 విపక్ష పార్టీలు ఇటీవల సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, RJD, DMK, శివసేన-UBT, JMM, సమాజ్ వాదీ వంటి పార్టీలు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన జాబితాలో ఉన్నాయి. మరోవైపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సహా 25 పార్టీలు ప్రారంభోత్సవానికి హాజరు కానున్నట్లు తెలిపాయని కేంద్రం చెప్పింది.
75 రూపాయల నాణెం విడుదల
పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని 75 రూపాయల నాణేన్ని విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నాణేన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. నాణేనికి ఓ వైపున పార్లమెంటు కొత్త భవనం ముద్రించి ఉండనుంది. ఓ అంచున సంసద్ సంకుల్ అని దేవనగరి లిపిలో మరో అంచున పార్లమెంట్ కాంప్లెక్ అని ఆంగ్లంలో ముద్రించనున్నారు. నాణేనికి ఓ వైపు సింహం గుర్తు కలిగిన అశోకుడి స్తంభం ఉంటుంది. దాని కింద సత్యమేవ జయతే అని ముద్రించి ఉంటుందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. 35 గ్రాముల బరువుండే ఈ నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, చెరో ఐదు శాతం నికెల్, జింక్ లోహాలతో తయారు చేయనున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.
సెంగోల్‌పై మాటలయుద్ధం
మరోవైపు చారిత్రక నేపథ్యం కలిగిన సెంగోల్ అనే రాజదండాన్ని లోక్‌సభలో ప్రతిష్టించటంపై రాజకీయ దుమారం తీవ్రమవుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. బ్రిటీషర్ల నుంచి భారత్‌కు అధికార మార్పిడికి గుర్తుగా రాజదండం అందించారని చెప్పటానికి రుజువుగా ఎలాంటి దస్త్రాలు లేవని కాంగ్రెస్ పేర్కొంది. అధికార మార్పిడికి సెంగోల్ గుర్తు అని లార్డ్ మౌంట్ బాటన్ కానీ, అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కానీ, రాజగోపాలచారి కానీ చెప్పినట్లు సరైన ఆధారాలు లేవని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ చెప్పారు.
New Parliament Building Inauguration Date : భారత నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ.. మే 28న ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. కొత్త పార్లమెంట్ నిర్మాణ పనులు రెండేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. 2020 డిసెంబర్లో భవనానికి పునాది రాయి వేశారు ప్రధాని మోదీ. నిజానికి గతేడాది నవంబర్లోనే భవనం పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల నిర్మాణం ఆలస్యమైంది.
Parliament New Building : 64,500 చదరపు మీటర్ల పరిధిలో కొత్త పార్లమెంట్ భవనం ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు రెండు అంతస్తులు ఉంటాయి. ప్రస్తుత భవనాన్ని పోలినట్లు ఉండే కొత్త పార్లమెంట్ ఎత్తు సైతం పాత భవనం అంతే ఉంటుంది. ఒకేసారి 1,224 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుగా పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక ఆఫీసులు ఉంటాయి. ఎంపీల కోసం విశాలమైన లాంజ్, లైబ్రరీ, కమిటీల గదులు, క్యాంటీన్లు ఉండనున్నాయి.
ఇవీ చదవండి : కొత్త పార్లమెంట్ ఓపెనింగ్‌పై పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
యువ జంట కిరాతకం.. హోటల్ రూమ్‌లో వృద్ధుడి హత్య.. శరీరాన్ని ముక్కలు చేసి సూట్‌కేస్‌లో..