constable saved a child from burning house: ఆకస్మికంగా చెలరేగిన హింస కారణంగా ఇళ్లకు మంటలు అంటుకుంటే.. ఓ చిన్నారిని రక్షించేందుకు రాజస్థాన్‌కు చెందిన కానిస్టేబుల్ సాహసం చేశారు. చుట్టూ మంటలు చెలరేగుతున్నా, ఇరుకైన సందులగుండా వేగంగా పరిగెత్తి చిన్నారి ప్రాణం కాపాడారు. ఇప్పుడు ఆ దృశ్యాన్ని షామిలికి చెందిన ఐపీఎస్ అధికారి సుకీర్తి మాధవ మిశ్రా నెట్టింట్లో షేర్ చేశారు. 'ఓ విలువైన ప్రాణాన్ని కాపాడిన రాజస్థాన్ పోలీస్ నేత్రేశ్ శర్మ పట్ల గర్వంగా ఉంది. మాటల్లో వర్ణించలేని విషయాన్ని ఈ ఒక్క చిత్రం ప్రతిబింబిస్తుంది' అంటూ ప్రశంసించారు.
Rajasthan cop saved a child: ఏప్రిల్ 2న రాజస్థాన్‌లోని కరౌలీ ప్రాంతంలో ఘర్షణలు చెలరేగాయి. హిందూ కొత్త సంవత్సరాదిని పురస్కరించుకొని నిర్వహించిన మోటార్ సైకిళ్ల ర్యాలీపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడి చేశారు. దాంతో చెలరేగిన ఘర్షణల్లో కొందరు దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. అప్పుడు అక్కడ చిక్కుకుపోయిన చిన్నారిని రక్షించేందుకు కానిస్టేబుల్ సాహసం చేశారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్.. నేత్రేశ్తో మాట్లాడారు. చిన్నారిని కాపాడేందుకు చేసిన సాహసాన్ని ఫోన్లో అభినందించారు.
దీనిపై నేత్రేశ్ శర్మను మీడియా పలకరించింది. కొత్త సంవత్సరం రోజు నిర్వహించిన ర్యాలీ సమయంలో నేత్రేశ్ రక్షణ విధులు చూస్తున్నారు. 'ర్యాలీ సమయంలో ఒక్కసారిగా ఎవరో రాళ్లు విసిరారు. అప్పుడు రోడ్డుపై గాయపడిన ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారు ఆసుపత్రికి తీసుకెళ్లమని అభ్యర్థించగా.. నేను వారికి సహకరించాను. అప్పుడే షాపులకు నిప్పు అంటుకోగా..రెండు షాపుల మధ్య ఒక ఇల్లు ఉండటం గ్రహించాను. ఆ ఇంట్లో చేతిలో పసిబిడ్డతో మహిళలు చిక్కుకుపోయి ఉన్నారు. వెంటనే వారి దగ్గరకు పరిగెత్తాను. నన్ను చూసినవెంటనే వారు కాపాడమని అభ్యర్థించారు. నేను ఆ బిడ్డను తీసుకొని, నా వెనకాలే వారిని వచ్చేయమని చెప్పాను. అలా ఆ చిన్నారిని బయటకు తీసుకువచ్చి వారికి అప్పగించాను. ఇది కేవలం నా బాధ్యత' అంటూ తనపై వస్తున్న ప్రశంసలకు వినమ్రంగా సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా.. ఆందోళనలు అదుపు చేసేందుకు కరౌలీ ప్రాంతంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్ సేవలకు పాక్షికంగా పరిమితులు పెట్టింది. 50 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: కుప్పకూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం.. గాల్లోకి ఎగిరిన క్షణాల్లోనే..!