NCP president Sharad Pawar : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు శరద్ పవార్ వెల్లడించారు. నేతలు, కార్యకర్తల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నూతన ఉత్తేజంతో ఎన్సీపీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. పార్టీలో సంస్థాగత మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, ఎన్సీపీ వారసుల ప్రణాళికను సైతం ఖరారు చేయాల్సి ఉందని చెప్పారు. ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని చేపట్టేందుకు తన కుమార్తె సుప్రియా సూలే తిరస్కరించినట్లు వెల్లడించారు పవార్.
"మీ మనోభావాలను నేను అగౌరపరచలేను. మీరు చూపించిన ప్రేమ వల్ల నా రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. రాజీనామాను వ్యతిరేకిస్తూ మీరు చేసిన డిమాండ్‌కు సమ్మతిస్తున్నాను. మీరు నాపై పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతతో ఉన్నా. ఏ సంస్థలోనైనా వారసత్వ ప్రణాళిక ఉండాలి. పార్టీలో సంస్థాగత మార్పులు తెచ్చేందుకు పనిచేస్తా. కొత్త బాధ్యతలు అప్పగించి.. కొత్త నాయకత్వాన్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తా. పార్టీ వృద్ధికి తీవ్రంగా కృషి చేస్తా. మా భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం."
-శరద్ పవార్, ఎన్సీపీ వ్యవస్థాపకుడు
అజిత్ పవార్ ఎక్కడ?
పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు పవార్. ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ వివరాలు వెల్లడించారు. అయితే, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు అజిత్ పవార్ రాకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై శరద్ పవార్ వివరణ ఇచ్చారు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అందరూ ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు.
"కొంతమంది ఇక్కడ ఉన్నారు. ఇంకొంత మంది లేరు. ఈరోజు ఉదయం పార్టీ సీనియర్ నేతలంతా కలిసి ఏకగ్రీవంగా ఓ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడిగా నన్ను కొనసాగాలని కోరారు. ఆ నిర్ణయంతో తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇక్కడ ఎవరు లేరు, ఎవరు ఉన్నారు అని చూడటం సరికాదు. దాని వెనక కారణమేంటని వెతకడం అవసరం లేదు."
-శరద్ పవార్
మరోవైపు, పార్టీ సీనియర్ నేత జయంత్ పాటిల్ సైతం అజిత్ పవార్ గైర్హాజరుపై స్పందించారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని శరద్ పవార్‌ను అజిత్ సైతం కోరారని చెప్పారు. పవార్ ఇంటికి వెళ్లిన బృందంలో ఆయన కూడా ఉన్నట్లు తెలిపారు. ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి అందరికీ తెలియదని చెప్పారు. 'ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్న విషయం నాకు కూడా తెలియదు. అందుకే కాస్త ఆలస్యంగా వచ్చా. అందరికీ దీని గురించి చెప్పలేదు' అని జయంత్ పాటిల్ వివరించారు.
ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల అనూహ్య ప్రకటన చేశారు శరద్ పవార్. కొత్త తరం పార్టీ బాధ్యతలు చేపట్టే సమయం ఆసన్నమైందని అప్పుడు పేర్కొన్నారు. ఇకపై వ్యవసాయం, విద్యా సంబంధిత అంశాలపై దృష్టి సారిస్తానని చెప్పారు. అయితే, ఆయన నిర్ణయాన్ని పార్టీ నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. రాజీనామా వెనక్కి తీసుకోవాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఇంకొందరు కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ నేతల ఒత్తిడి నేపథ్యంలో తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.