ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం పొత్తికడుపులో నొప్పితో బాధపడిన ఆయన ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. పవార్‌కు చేసిన వైద్యపరీక్షల్లో ఆయన గాల్ బ్లాడర్‌లో సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
" మా పార్టీ అధినేత శరద్ పవార్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం సాయంత్రం ఆయనకు పొత్తికడుపులో నొప్పి వచ్చింది. వైద్యసేవల కోసం ముంబయిలోని బ్రీచ్ క్యాండీ అస్పత్రికి తరలించాం. గాల్ బ్లాడర్‌లో సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు."
- నవాబ్ మాలిక్, మహారాష్ట్ర మంత్రి
మార్చి 31న ఆస్పత్రిలో చేరనున్న పవార్ ఎండోస్పోపి, శస్త్ర చికిత్స చేయించుకోనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యే వరకు పవార్ పాల్గొనే అన్ని కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు ఎన్‌సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ తెలిపారు.
అహ్మదాబాద్‌లోని ఒక బడా పారిశ్రామికవేత్త నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను పవార్ కలిశారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజా ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి: 'ఆయన నాయకత్వంలో కొత్త కూటమి అవసరం'