NCERT Removed Periodic Table : పదో తరగతి పాఠ్య ప్రణాళిక నుంచి.. మరికొన్ని పాఠ్యాంశాలను తొలగిస్తూ జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) నిర్ణయం తీసుకుంది. సిలబస్ హేతుబద్దీకరణలో భాగంగా.. పదో తరగతి పాఠాల్లో పిరియాడిక్ టేబుల్, ప్రజాస్వామ్యం, శక్తి వనరుల పాఠ్యాంశాలను తొలగించాలని నిర్ణయించింది. విద్యార్థులపై భారాన్ని తగ్గించేందుకే.. ఈ నిర్ణయం తీసుకున్నామని NCERT వెల్లడించింది.
ఇటీవలే జీవ పరిణామ సిద్ధాంతాన్ని పదో తరగతి సిలబస్ నుంచి తొలగించిన NCERT... ఇప్పుడు మరికొన్ని పాఠాలను తొలగించింది. పర్యావరణ సుస్థిరత, శక్తి వనరులు, ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యానికి సవాళ్లు, రాజకీయ పార్టీల పూర్తి అధ్యాయాలను తొలగించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులపై భారాన్ని తగ్గించడం అత్యవసరమని NCERT పేర్కొంది. పిల్లలపై చదువుల భారాన్ని తగ్గించేందుకు సిలబస్ హేతుబద్దీకరణ జరుగుతోందన్న కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాస్ సర్కార్.. తర్వాతి తరగతుల్లో వారు ఆ సిలబస్‌లను చదువుకోవచ్చని పేర్కొన్నారు.
GRE కీలక నిర్ణయం..
GRE Exam Duration : 2023 సెప్టెంబరులో జరగబోయే గ్రాడ్యుయేట్ రికార్డ్ పరీక్ష (GRE) సమయాన్ని 1 గంట 58 నిమిషాలకు కుదించామని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్(ఈటీఎస్) గురువారం ప్రకటించింది. ఎగ్జామ్ పూర్తయిన తర్వాత 10 రోజుల్లోనే స్కోర్‌ను విడుదల చేస్తామని తెలిపింది. అంతకుముందు GRE పరీక్ష సమయం 3 గంటల 45 నిమిషాలు ఉండగా.. ఆ సమయాన్ని దాదాపు సగానికి తగ్గించామని పేర్కొంది. అలాగే వ్యాసరచన, వెర్బల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ రీజనింగ్ విభాగాల్లో ప్రశ్నల సంఖ్యను తగ్గిస్తున్నట్లు పేర్కొంది.
అమెరికాలోని ప్రధాన విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు అకడమిక్ స్కోరుతో పాటు జీఆర్‌ఈ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు. జీఆర్‌ఈ స్కోర్ అధికంగా ఉంటే సీటుతోపాటు ఉపకారవేతనాలూ లభించేందుకు అవకాశం ఉంటుంది. ఈ స్కోరు ఐదేళ్ల వరకు చెల్లుబాటవుతుంది. అందుకే అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు ఈ పరీక్ష కోసం రాత్రింబవళ్లు కష్టపడతారు. ఇందులో క్వాంటిటేటివ్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, ఎనలిటికల్ రైటింగ్ ఉంటాయి.
గాంధీ మరణం తొలగింపు..
NCERT Removed Gandhi Death : గాంధీజీ మరణం, ఆనాటి మత పరిస్థితులు, హిందూ-ముస్లిం సమైఖ్యతకు గాంధీజీ చేసిన కృషి హిందూ అతివాదులను ఎలా రెచ్చగొట్టింది, RSS వంటి సంస్థలను దేశంలో నిషేధించిన ఘటనల గురించి వివరించే అనేక పాఠాలను 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకాల నుంచి NCERT ఇటీవల తొలగించింది. హేతుబద్ధీకరించిన పాఠ్యపుస్తకాలు వచ్చే విద్యాసంవత్సరంలో అందుబాటులోకి రానున్నట్లు NCERT తెలిపింది. ఈ రేషనలైజేషన్ గతేడాది జూన్‌లోనే జరిగినట్లు పేర్కొన్న NCERT.. ఆయా అంశాలు ఇప్పటి పరిస్థితులకు సంబంధం లేనివిగా చెప్పింది. తొలగించిన వాటిలో గుజరాత్ అల్లర్లు, మొఘల్ కోర్టులు, అత్యయిక పరిస్థితి, ప్రచ్ఛన్న యుద్ధం, నక్సలైట్ ఉద్యమం వంటి అంశాలున్నాయి.
2022 జూన్‌లోనే పాఠ్యపుస్తకాల హేతుబద్ధీకరణ జరిగినట్లు NCERT తెలిపింది. కొవిడ్ కారణంగా ఉపాధ్యాయులతో అవసరం లేకుండా విద్యార్థులు స్వయంగా చదివి అర్థం చేసుకునేలా, సృజనాత్మక పెంపొందించేలా మార్పులు చేసినట్లు పేర్కొంది. దీంతో విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.