మహారాష్ట్రలోని గడ్చిరౌలీలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. సీ 60 కమాండో పోలీసుల బృందం జరిపిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతం అయ్యారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల్లో పర్మిలి దళ కమాండర్ బిట్లు మాధవి కూడా ఉన్నారు. మన్నెరజరం అడవుల్లో మొత్తం 25 మంది మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా క్యాంపును ఏర్పాటు చేస్తున్న సమయంలో పోలీసులు అక్కడకు వెళ్లగా.. నక్సల్స్ దాడికి దిగారు. పోలీసులు ఎదురు కాల్పులకు దిగడం వల్ల ముగ్గురు బిట్లు మాధవి సహా మరో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
మావోయిస్టుల IED దాడిలో 10 మంది పోలీసులు మృతి..
మార్చి 26న ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు జరిపిన ఐఈడీ దాడిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10 మంది పోలీసులు కాగా ఒకరు డ్రైవర్. దంతెవాడ అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో బుధవారం ఉదయం డిస్ట్రిక్ రిజర్వ్‌గార్డ్ పోలీసులు.. ప్రత్యేక యాంటీ-నక్సలైట్ ఆపరేషన్ చేపట్టారు. ఆ ఆపరేషన్ ముగించుకుని మినీ వ్యాన్‌లో తిరిగివస్తుండగా.. అరణ్పుర్ ప్రాంతంలో మావోయిస్టులు ఐఈడీతో వాహనాన్ని పేల్చేశారు. దాడి జరిగిందని సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించారు. ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అనంతరం స్థానిక అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భారీగా కూబింగ్ చేపట్టారు.
పోలీస్ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సలైట్లు మృతి..
ఇటీవలే ఝార్ఖండ్లో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సలైట్లు మృతి చెందారు. వీరిలో ఇద్దరిని స్పెషల్ ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. రాజధాని రాంచీకి 160 కి.మీ. దూరంలోని ఈ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై సమాచారం రావడం వల్ల సీఆర్పీఎఫ్ కోబ్రా యూనిట్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలోనే భద్రతా సిబ్బందిపైకి మావోయిస్టులు కాల్పులు జరపగా.. ఎదురుకాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటన స్థలంలో రెండు ఏకే-47 తుపాకులు, రెండు నాటు తుపాకులు సహా మరికొన్ని ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నక్సల్స్ తలదాచుకున్న శిబిరాన్ని పోలీసుల ధ్వంసం చేశారు.
భీకర ఎన్‌కౌంటర్ ముగ్గురు నక్సల్స్ హతం..
కొద్ది రోజులు క్రితం మధ్యప్రదేశ్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. లోదంగి అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతి చెందిన మావోయిస్టుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు. అయితే, ఈ ముగ్గురు మావోలపై మొత్తంగా రూ.30లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.