Indian navy day 2021: దేశ ఉత్తర సరిహద్దులోని పరిస్థితులు, కరోనా మహమ్మారి కారణంగా రెండు సంక్లిష్టమైన సవాళ్లు ఏర్పడ్డాయని భారత నౌకాదళ(నేవీ) అధిపతి అడ్మిరల్ ఆర్.హరి కుమార్ పేర్కొన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు నేవీ సిద్ధంగా ఉందని తెలిపారు. భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
"కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ.. భారత నౌకాదళం పోరాట సంసిద్ధతను కొనసాగించింది. ఫలితంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఎన్నో దుస్సాహసాలను అడ్డుకుంది. ఎలాంటి భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకైనా నేవీ సిద్ధంగా ఉందని నేను హామీ ఇవ్వాలనుకుంటున్నాను. హిందూ మహాసముద్రంలోకి చైనా చొరబాట్లను, ఆ దేశ కార్యకలాపాలను నేవీ నిశితంగా పరిశీలిస్తోంది."
-అడ్మిరల్ ఆర్ హరి కుమార్, భారత నౌకాదళ అధిపతి
'మేక్ ఇన్ ఇండియా' పథకం కింద 39 యుద్ధనౌకలు, జలాంతర్గాములు నేవీ కోసం నిర్మితమవుతున్నాయని అడ్మిరల్ ఆర్.హరి కుమార్ తెలిపారు. అత్మనిర్భర భారత్ స్ఫూర్తిని నేవీ చాటుతోందని పేర్కొన్నారు. నేవీలో మహిళల పాత్రను విస్తరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
ఇదీ చూడండి: INS vela submarine: నావికాదళ అమ్ములపొదిలో ఐఎన్ఎస్ 'వేలా'యుధం!
ఇదీ చూడండి: Indian Navy Jobs: నేవీలో 275 అప్రెంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్