భారత నౌకాదళ అధిపతి ఆర్. హరికుమార్ కొవిడ్ బారినపడ్డారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కంబైన్డ్ కమాండర్స్ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఆయనకు కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యిందని అధికారులు తెలిపారు. నేవీ చీఫ్ హరికుమార్ వెంటనే దిల్లీకి తిరుగు పయనమైనట్లు పేర్కొన్నారు.
"సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన 1,300 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించాం. అందులో భారత నౌకదళ అధిపతి హరికుమార్ సహా 22 మందికి కొవిడ్ నిర్ధరణ అయ్యింది. కొవిడ్ పాజిటివ్‌గా తేలిన వెంటనే హరికుమార్ ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది."
--అధికారులు
భారత నౌకాదళ అధిపతిగా వైస్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ 2021 నవంబరులో బాధ్యతలు స్వీకరించారు. 1962 ఏప్రిల్ 12న జన్మించిన హరికుమార్ 1983లో భారత నౌకాదళంలో చేరారు. 39 ఏళ్లలో ఆయన కమాండ్, స్టాఫ్ విభాగాల్లో పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఐఎన్‌ఎస్ నిషాంక్, మిస్సైల్ కార్వెట్, ఐఎన్‌ఎస్ కొరా, గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్‌ఎస్ రణ్‌విర్‌కు కమాండింగ్ అధికారిగా పనిచేశారు. నేవీ ఎయిర్‌క్రాఫ్ట్ ఐఎన్‌ఎస్ విరాట్‌కు నాయకత్వం వహించారు.
మరోవైపు.. కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి శనివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ భోపాల్‌కు చేరుకున్నారు. ఆయనకు మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూబాయ్ పటేల్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. స్వాగతం పలికారు. అలాగే శనివారం మధ్యాహ్నం భోపాల్-దిల్లీ మధ్య నడిచే వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. 'భోపాల్-దిల్లీ మధ్య నడిచే వందే భారత్ రైలును ప్రారంభించడం ఆనందంగా ఉంది. ప్రజలకు మరిన్ని సౌకర్యాలను అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం.' అని మోదీ అన్నారు.
స్వల్పంగా తగ్గిన కొవిడ్ కేసులు..
- భారత్‌లో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. క్రితం రోజుతో పోలిస్తే శుక్రవారం రోజువారీ కొవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి.
- శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకు 2,994 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- దిల్లీ, కర్ణాటక, పంజాబ్, కేరళలో కలిసి మొత్తం 9 మంది కొవిడ్ సోకడం వల్ల మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- దేశంలో ప్రస్తుతం 16, 354 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.
- ఇప్పటి వరకు కొవిడ్ బాధితుల సంఖ్య నాలుగు కోట్ల 47 లక్షలకు చేరింది.
- ఇప్పటి వరకు కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 5,30,000 దాటింది.
- రోజువారీ పాజిటివిటీ రేటు 2.09 శాతానికి చేరింది.
- రికవరీ రేటు 98.77 శాతానికి చేరింది.
- 2021 నుంచి ఇప్పటివరకూ 220.66 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.