సైన్యంలో చేపట్టాల్సిన సంస్కరణల్లో భాగంగానే అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టిందన్నారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్. అగ్నిపథ్‌ను రద్దు చేసే ఆలోచనే లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మాత్రమే సైన్యంలో సంస్కరణలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. దేశ భద్రత కన్నా మరేది ముఖ్యం కాదని ప్రధాని చెప్తుంటారని గుర్తుచేశారు. 2019 తర్వాత కశ్మీర్ ప్రజల ఆలోచన విధానం మారిపోయిందని.. ఇప్పుడిక ఎవరూ తీవ్రవాదం, పాకిస్థాన్‌కు మద్దతు తెలపట్లేదని పేర్కొన్నారు.
సైనిక నియామకాలు పూర్తిగా అగ్నిపథ్ పథకం ద్వారానే జరగవని స్పష్టం చేశారు డోభాల్. "సైన్యంలో అగ్నివీరులు మాత్రమే ఉండరు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ సైన్యంలో స్థానం దక్కించుకున్నవాళ్లకు కఠోర శిక్షణ ఉంటుంది. మరోవైపు రెజిమెంట్లు కూడా కొనసాగుతాయి. వాటిలో ఎలాంటి మార్పు లేదు" అని స్పష్టం చేశారు. యువత దేశంపైన, ప్రభుత్వంపైన నమ్మకం ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
సైన్యంలో సంస్కరణలు అవసరం. ఆధునిక ఆయుధాలు అందిస్తే సరిపోదు. సాంకేతికత, వ్యవస్థ, బలగాలు, విధానాలు మొదలైన విషయాల్లో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంస్కరణలు చేపట్టాలి. ప్రస్తుతం యుద్ధ విధానమే మారిపోతోంది. కనిపించని శత్రువుతో పోరాడాల్సి వస్తోంది. టెక్నాలజీ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. రేపటికి సిద్ధంగా ఉండాలి అంటే ఈరోజు మనం మారాల్సిందే. దేశంలోని యువతకు ఏదో విధంగా సేవ చేయాలని ఉంటుంది. దేశాన్ని దృఢంగా తయారుచేసే క్రమంలో వారి శక్తి, నైపుణ్యాలు కీలక పాత్ర పోషిస్తాయి."
-అజిత్ డోభాల్
నిరసనల్లో భాగంగా పలు ప్రాంతాల్లో ఏర్పడిన ఉద్రిక్తతల వెనుక కోచింగ్ సెంటర్లు ఉన్నాయని ఆరోపణలపై స్పందించిన ఢొభాల్.. ఎఫ్ఐఆర్లు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే పలువురు నిందితులను గుర్తించామన్నారు. త్వరలోనే ఈ అల్లర్ల వెనుక ఎవరున్నారో తెలుస్తుందని పేర్కొన్నారు. అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో డోభాల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీ చూడండి : 17 వేల అడుగుల ఎత్తులో హిమవీరుల యోగాసనాలు.. గడ్డకట్టే చలిలోనూ సాహసాలు