Rahul Gandhi National Herald Case: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణకు జూన్ 13న తమ ఎదుట హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికార వర్గాలు వెల్లడించాయి. అసలు గాంధీ జూన్ 2నే ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంది. కానీ.. ప్రస్తుతం భారత్‌లో లేనందున విచారణకు అందుబాటులో ఉండబోనని ఈడీకి సమాచారం అందించారు రాహుల్. షెడ్యూల్ ప్రకారం తనకు వివిధ కార్యక్రమాలు ఉన్నాయని వెల్లడించారు. అందుకు సమ్మతించిన ఈడీ.. జూన్ 13న దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి విచారణకు రావాలని మళ్లీ సమన్లు పంపింది.
ఇదే కేసుకు సంబంధించి రాహుల్ తల్లి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసింది. ఆమెను జూన్ 8న విచారణకు రావాల్సిందిగా పేర్కొంది. కాగా.. సోనియా గురువారం కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న ఆమె.. నిర్దేశించిన గడువులోనే విచారణకు హాజరవుతానని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కూడా శుక్రవారం కరోనా బారినపడ్డారు. తల్లికి సోకిన మరుసటి రోజే ప్రియాంకకు కూడా కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు ఉన్నాయని, క్వారంటైన్లో ఉన్నట్లు స్వయంగా ఆమె ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసిన వారు, సన్నిహితులు జాగ్రత్తలు పాటించాలని ప్రియాంక కోరారు.
నేషనల్ హెరాల్డ్ కేసు ఇదే: కాంగ్రెస్‌కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను ఈడీ ప్రశ్నించింది.
ఇవీ చూడండి: సోనియా, రాహుల్‌కు ఈడీ సమన్లు.. కాంగ్రెస్, భాజపా మాటల యుద్ధం