శరీరాన్ని మెలికలు తిప్పుతూ.. అతి కష్టమైన యోగాసనాలను సులువుగా వేసేస్తున్నారు ఈ ఇద్దరు చిన్నారులు. 70 ఏళ్ల గురువు సారథ్యంలో ఆసనాలను ఈ అక్కాచెల్లెళ్లు.. అవపోసన పడుతున్నారు. యోగాపోటీల్లో పతకాలు సాధిస్తున్న ఈ బాలికలు.. తమ అద్భుతమైన ప్రతిభతో అబ్బురపరుస్తున్నారు.
మధ్యప్రదేశ్ సత్నా జిల్లాలోని బంధవ్‌గఢ్ కాలనీకి చెందిన వారు కృపా మిశ్ర, ప్రతీక్షా మిశ్ర. ఈ చిచ్చర పిడుగులు చిన్నప్పటి నుంచి డ్యాన్సులు వేసుకుంటూ యోగాకు ఆకర్షితులయ్యారు. అప్పటి నుంచి యోగాసనాలను సాధన చేస్తూ.. 70 ఏళ్ల తాతయ్య మహేశ్ మిశ్రా శిక్షణలో రాటుదేలుతున్నారు.
"మూడేళ్ల నుంచి యోగా సాధన చేస్తున్నాను. నాకు మా తాత యోగా నేర్పిస్తారు. నేను మొదటి సారి గోల్డ్ మెడల్ గెలిచినప్పటి నుంచి యోగా మీదా ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. నేను ప్రతిరోజు ఉదయం, సాయంత్రం యోగా చేసేదాన్ని. ఇప్పుడు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నాను. ఆసనాలు చాలా రకాలు ఉంటాయి. అందులో నేను చాలా వరకు వేయగలను. యోగా వల్ల చాలా లాభాలున్నాయి. రోజు యోగా చేస్తే శరీరం ఫ్లెక్సిబుల్‌గా, స్ట్రెచబుల్గా ఉంటుంది. రోగాల బారిన పడకుండా ఉంటాము."
-- కృపా మిశ్ర, బాలిక
మొదట 13 ఏళ్ల కృపా మిశ్రా.. యోగాసనాలు వేయడం మొదలు పెట్టింది. అక్కను చూసి చెల్లెలు కూడా యోగాసనాలు సాధన చేసింది. 2019లో మొదటి సారిగా యోగా పోటీల్లో పాల్గొంది కృపా మిశ్ర. ఇలా పోటీల్లో పాల్గొంటూ.. 12 బంగారు పతకాలతో పాటు 2 రజత పతకాలు సాధించింది కృపా.
"నేను చిన్నప్పటి నుంచి యోగా సాధన చేస్తున్నాను. ఈ పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాను. ఈ పిల్లల్లో చాలా టాలెంట్ ఉంది. వీళ్లు డ్యాన్సు కూడా చేసే వారు. అలా యోగా వైపు ఆకర్షితులయ్యారు. కొందరి సలహాతో వీళ్లను పోటీలకు తీసుకెళ్లాను. అక్కడ వాళ్లు తమ ప్రతిభ కనబర్చారు. దీంతో నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. అలాగే వీళ్లకు శిక్షణ ఇచ్చాను. పెద్ద అమ్మాయిని చూసి చిన్న బాలిక కూడా యోగాపై ఆసక్తి పెంచుకుంది. ఈ కాలంలో అమ్మాయిలను ఎందులోనూ వెనకడుగు వేయనీయకూడదు. వాళ్లను తక్కువగా చూడకూడదు.. వారి పట్ల భేదభావాలు చూపించకూడదు. అప్పుడే అమ్మాయిలు కూడా అబ్బాయిల లాగా ముందుకెళ్తారు. "
-- మహేశ్ మిశ్ర, 70 ఏళ్ల యోగా గురువు
లాక్డౌన్ సమయంలోనూ.. పతకాల వేట అపలేదు కృపా. ఇంట్లో ఉంటూనే అన్లైన్ పోటీల్లో పాల్గొంది. ఇందులో 56 నిమిషాల్లో 221 సార్లు సూర్య నమస్కారాలు పూర్తి చేసి అబ్బురపరిచింది. యెగాసనాలు వేసేటప్పుడు రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయని.. వాటన్నింటినీ అధిగమించి సాధన చేస్తానని చెబుతోంది కృపా మిశ్ర.