ఉల్లిగడ్డలను గోదాంలలో ఎక్కువకాలం ఉంచితే చాలా వరకు పాడైపోతాయి. రైతులకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. దీన్ని నివారించడానికి నాశిక్‌కు చెందిన కల్యాణి షిండే సాంకేతికత ఉపయోగించి 'గోదాం ఇన్నోవేషన్' పేరుతో ఓ పరికరాన్ని అభివృద్ధి చేశారు. దీని ద్వారా నిల్వ ఉంచిన ఉల్లిలో పాడైపోయిన వాటిని గుర్తించవచ్చు. దీనిని రైతులు ఉపయోగిస్తే నష్టాలు తగ్గుతాయి.
ఆసియాలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్‌గా నాశిక్‌కు పేరుంది. దేశంలోని మొత్తం ఉల్లి ఉత్పత్తిలో 40 శాతం ఈ నగరం నుంచే జరుగుతుంది. లక్షల టన్నుల ఉల్లి ఇక్కడి నుంచి అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి అవుతుంది. ఒకవేళ మార్కెట్లో ధర లేకపోతే.. రైతులు తమ పంటను ఇంట్లో, లేదా గుడిసెలలో నిల్వ చేసుకుంటారు. పలు కారణాల వల్ల నిల్వ ఉంచిన ఉల్లిలో 40 శాతం పాడవుతోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కల్యాణి ఈ ఆవిష్కరణ చేశారు.
రైతు కుటుంబం నుంచి టీసీఎస్ వరకు
జిల్లాలోని లాసాల్గావ్కు చెందిన ఓ రైతు కుటుంబంలో జన్మించిన కల్యాణి.. కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశారు. డిగ్రీ చివరి సంవత్సరంలో టీసీఎస్ ఇంక్యుబేషన్ సెంటర్ అయిన డిజిటల్ ఇంపాక్ట్ స్క్వేర్‌కు ఎంపికయ్యారు. ఈ సమయంలోనే ఉల్లి రైతులపైకి ఆమె దృష్టి మళ్లింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ రైతులు ఎందుకు నష్టపోతున్నారని ఆలోచించారు. దీనిపై పరిశోధన చేయడం ఆరంభించారు. నిల్వ చేసే ప్రాంతంలో సరైన ఉష్ణోగ్రత, తేమ లేనందునే ఉల్లి పాడవుతున్నట్లు కనుగొన్నారు. అనంతరం పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ పరికరం ద్వారా ఉల్లి పాడైపోయినట్లు వాసన వస్తే రైతులకు సమాచారం అందిస్తుంది. ఉల్లి కుల్లిపోయేటప్పుడు బయటకు వచ్చే గ్యాస్‌ను గుర్తించి ఈ మేరకు స్పందిస్తుంది.
కల్యాణి ఆలోచనకు 2018లో ఉల్లి, వెల్లుల్లి పరిశోధనా కేంద్రం డైరెక్టర్ నుంచి రూ. 3 లక్షల గ్రాంట్ లభించింది. అన్లిమిటెడ్ ఇండియా అనే సంస్థ నుంచి మరో రెండు లక్షలు దక్కింది. ఈ నగదును ఉపయోగించి పలు ప్రాంతాల్లో ఈ పరికరాన్ని పరీక్షించారు. వచ్చే ఏడాది నాటికి 35 మార్కెట్లలో దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు.