Nashik human body parts: మూసి ఉంచిన ఓ దుకాణంలో మనిషి శరీర భాగాలు కనిపించడం కలకలం రేపింది. మహారాష్ట్ర నాశిక్‌లోని ముంబయి నాకా పోలీస్ స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి వీటిని గుర్తించారు. ఆస్పత్రులు, రీసెర్చ్ సెంటర్లలో ఉంచినట్లుగా జాగ్రత్తగా ఈ అవయవాలను దాచారు. ఈ దుకాణం.. 15 ఏళ్ల నుంచి మూసేసి ఉండటం గమనార్హం.
రెండు దుకాణాల్లో ఈ అవయవాలు కనిపించాయని పోలీసులు తెలిపారు. 'ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, శవపరీక్ష కేంద్రాల్లో భద్రపరిచినట్లు వీటిని పేర్చారు. మనిషి తలలు, చేతులు, చెవులు, ఇతర శరీర అవయవాలు కెమికల్ బాటిళ్లలో ఉంచారు. ఇతర అవయవాలను బకెట్లలో ఉంచారు. ఈ రెండు దుకాణాలు గత 15ఏళ్లుగా మూసే ఉన్నాయి' అని పోలీసులు వివరించారు.
కొద్దిరోజుల నుంచి దుకాణాల నుంచి దుర్గంధం వ్యాపిస్తోందని స్థానికులు ఫిర్యాదు చేశారని డిప్యూటీ కమిషనర్ పూర్ణిమా చౌగులే తెలిపారు. ఈ దుకాణం సమీపంలో పార్క్ చేసిన వాహనాల బ్యాటరీలు సైతం చోరీకి గురయ్యాయని వెల్లడించారు. 'ఈ దుకాణం శుభాంగిని షిందే అనే వ్యక్తికి చెందినది. శుభాంగిని షిందే.. మాజీ బ్యాంకు ఉద్యోగి. ఆమెకు ఇద్దరు కుమారులు. అందులో ఒకరు డెంటిస్ట్ కాగా, మరొకరు ఈఎన్టీ నిపుణుడు. ఈ దుకాణం షటర్ విరిగిపోయింది. అవయవాలపై ఉన్న కోతలను పరిశీలించాం. ఇది కచ్చితంగా వైద్య నిపుణులు చేసిన పనే అని నిర్ధరించుకున్నాం. శుభాంగిని కుమారులు, వారి స్నేహితులకు ఇందులో సంబంధం ఉందని భావిస్తున్నాం. వారిని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నాం' అని డీసీపీ పూర్ణిమ వివరించారు.
ఇదీ చదవండి: గన్‌తో కాల్చుకున్న జవాను.. నిప్పంటించుకున్న భార్య.. అన్నకు గుండెపోటు