నారదా కుంభకోణం కేసులో(Narada case) సీబీఐ అరెస్టు చేసిన తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలకు కోల్‌కతా హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రూ. 2లక్షల బాండు, రెండు పూచీకత్తుల మీద వారికి బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దని తెలిపింది.
మంత్రులు ఫిర్హాద్ హకీం, సుబ్రతా ముఖర్జీ, ఎమ్మెల్యేలు మదన్ మిత్రా, సోవన్ ఛటర్జీలను సీబీఐ కొద్దిరోజుల కింద అరెస్టు చేసింది.
ఏమిటీ 'నారదా స్కాం'?
నారదా న్యూస్ పోర్టల్‌కు చెందిన మ్యాథ్యూ శామ్యూల్ 2014లో శూల శోధన (స్టింగ్ ఆపరేషన్) నిర్వహించారు. ఒక ఊహాజనిత కంపెనీకి లాభం చేకూర్చడానికి లంచాలు ఇస్తామని చెప్పగా.. అందుకు అప్పట్లో మంత్రులుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అంగీకరించారు. మంత్రి ఫిర్హాద్ హకీం రూ.5 లక్షలు తీసుకోవడానికి సుముఖత చూపారు. మంత్రి సుబ్రతా ముఖర్జీ, మదన్ మిత్ర(ఎమ్మెల్యే) రూ.5 లక్షల వంతున, సోవెన్ ఛటర్జీ(ఎమ్మెల్యే) రూ.4 లక్షలు, ఐపీఎస్ అధికారి ఎస్‌ఎంహెచ్ మీర్జా రూ.5 లక్షలు తీసుకుంటూ కెమెరాకు చిక్కారు.
2016లో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇది ప్రసారమైంది. న్యాయస్థానాల సూచనల మేరకు 2017 ఏప్రిల్ 16న సీబీఐ వీరితో పాటు 13 మందిపై కేసులు నమోదు చేసింది.
వీరిపై దర్యాప్తునకు అనుమతి ఇస్తూ ఈ నెల 7న గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ఉత్తర్వులు జారీచేశారు. మంత్రులపై విచారణకు గవర్నర్ ఆదేశించవచ్చంటూ 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు ఆధారంగా ఈ ఉత్తర్వులు ఇచ్చారు.
2021 మే18న వీరిని సీబీఐ అరెస్టు చేయగా.. సీఎం మమతా బెనర్జీ స్వయంగా సీబీఐ కార్యాలయం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. తనను కూడా అరెస్టు చేయాలంటూ అధికారులకు తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఆరుగంటల సేపు అక్కడే ఉన్నారు. సీఎంగా ప్రమాణం చేసిన రెండు రోజులకే.. మంత్రులపై విచారణకు గవర్నర్ అనుమతినివ్వడం వివాదానికి దారి తీసింది.
ఇదీ చదవండి: నారదా కుంభకోణం- టీఎంసీ మంత్రులు జైలుకు