Lokesh Fires on Jagan: చంద్రబాబు అంటే ఓ బ్రాండ్ అని బిల్‌గేట్స్, క్లింటన్, ఫార్చూన్ 500 సీఈవోలూ చెబుతారని.. అలాంటి వ్యక్తిపై దొంగకేసు పెట్టి జైలుకు పంపింది సైకో జగన్ ప్రభుత్వం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుపై లోకేశ్ స్పందించారు. చంద్రబాబు ప్రస్తుతం ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైల్ సమీపంలోని విద్యానగర్ విడిది కేంద్రం వద్ద లోకేశ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో లోకేశ్ మండిపడ్డారు.
ప్రపంచంలోనే అందరికీ తెలిసిన వ్యక్తి చంద్రబాబు: ప్రజలు, రాష్ట్రం, దేశం తప్ప వేరేమీ ఆలోచించని వ్యక్తి చంద్రబాబు అని లోకేశ్ అన్నారు. దేశరాజకీయాల్లోనే అరుదైన గుర్తింపు పొందిన వ్యక్తి చంద్రబాబు (Nara Chandrababu Naidu Greatness) అని.. ఉద్యోగాలు, పరిశ్రమలు, అభివృద్ధి గురించే చంద్రబాబు ఎప్పుడూ ఆలోచిస్తారని తెలిపారు. ప్రజాసంక్షేమం తప్ప అవినీతి చేయడం అనేది లోకేశ్ రక్తంలోనే లేదని.. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అందరికీ తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.
సైకో జగన్ చేసిన అతిపెద్ద తప్పు ఇదే: చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో ఎప్పుడూ లేనంత స్పందన వచ్చిందన్న లోకేశ్.. టీడీపీ బంద్‌కు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు తెలిపారన్నారు. బంద్‌ను జయప్రదం చేసిన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానన్న లోకేశ్.. బంద్‌లో పాల్గొన్న జనసేన, సీపీఎం, ఎమ్మార్పీఎస్ నేతలు, కార్యకర్తలకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు జోలికి రావడం.. సైకో జగన్ చేసిన అతిపెద్ద తప్పు అని మండిపడ్డ లోకేశ్.. జగన్ రాజకీయంగా, వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించబోతున్నారని హెచ్చరించారు. జగన్‌కు (Jagan Mohan Reddy) అధికారం అంటే ఏమిటో తెలియదని.. జగన్‌కు అధికారం అంటే కక్షసాధింపులు, వేధింపులు, దొంగ కేసులు, హింస మాత్రమే అని విమర్శించారు.
జగన్‌కు ఒళ్లంతా విషమే: పాముకు తలలోనే విషం ఉంటుంది.. జగన్‌కు ఒళ్లంతా విషమేనని.. చంద్రబాబుకు అవినీతి మరక అంటించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై చేసిన అవినీతి ఆరోపణలను ఎవరూ నమ్మడం లేదన్న లోకేశ్.. చంద్రబాబు అరెస్టును.. బంగాల్ సీఎం, జోహో సంస్థ ఛైర్మన్ ఖండించారని తెలిపారు. పింక్ డైమండ్, వివేకా హత్య, కోడికత్తి కేసుల్లో ఎంత అబద్ధం ఉందో.. ఈ కేసులోనూ అంతే అబద్ధం ఉందని లోకేశ్ అన్నారు. చంద్రబాబుకు, ఆయనకు చెందినవారి ఖాతాల్లోకి డబ్బు వెళ్లిందని నిరూపించలేకపోయారని పేర్కొన్నారు.
Cases on CM Jagan Mohan Reddy: జగన్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నాన్న.. అసలు నీ చరిత్ర ఏంటని మండిపడ్డారు. జగన్.. నీపై ఎన్ని కేసులున్నాయని ప్రశ్నించిన లోకేశ్.. వాటి వివరాలు మాలాగా పబ్లిక్‌గా చెప్పగలవా అంటూ నిలదీశారు. జగన్‌పై 38 కేసులు, 10 సీబీఐ కేసులు, జగన్‌పై 7 ఈడీ కేసులు, 21 ఇతర కేసులు ఉన్నాయని లోకేశ్ తెలిపారు. జగన్‌పై కేసులు పదేళ్లుగా ట్రయల్‌కు కూడా రావడం లేదన్న లోకేశ్.. జగన్ ఎంతగా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారో దీన్నిబట్టే అర్థం అవుతోందని విమర్శించారు. బాబాయి హత్య కేసు ముద్దాయిలను సైకో జగన్ కాపాడుతున్నారని.. సీబీఐకి పోలీసులను అడ్డుపెట్టి అవినాష్ అరెస్టు కాకుండా జగన్ కాపాడారని లోకేశ్ ఆరోపించారు.
అంతు తేల్చేవరకూ నా పోరాటం కొనసాగుతుంది: తాను రాజమహేంద్రవరంలోనే ఉన్నానన్న లోకేశ్.. ఎక్కడికీ పారిపోలేదని అన్నారు. నన్ను అరెస్టు చేయాలనుకుంటే వచ్చి చేసుకోండని సవాల్ (Nara Lokesh Challenge to YS Jagan) విసిరారు. ఎన్ని రోజులు జైలులో పెట్టుకుంటారో పెట్టుకోండని తెలిపారు. ఈ ప్రభుత్వం అంతు తేల్చేవరకూ నా పోరాటం కొనసాగుతుందన్న లోకేశ్.. పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందన్నది ఎంత నిజమో.. ఈ కేసులో అవినీతి జరిగిందన్నదీ అంతే నిజం అని లోకేశ్ మండిపడ్డారు. న్యాయాన్ని నిలబెట్టే ప్రక్రియలో ఎన్ని కుట్రలనైనా ఎదుర్కొంటామని.. మేం ప్రకటించిన ఆస్తులకంటే అదనంగా ఉంటే చూపించండని ఛాలెంజ్ చేశారు.
జగన్ సైకోయిజం ఏ స్థాయిలో ఉందో ఈ కేసుతో అర్థమైంది: ఛార్జ్‌షీట్‌లో పేరున్న వ్యక్తిని తితిదే బోర్డు సభ్యుడు (TTD Board Members) చేశారన్న లోకేశ్.. తనకున్న అవినీతి బురదను నేతలందరికీ అంటించాలని జగన్ అనుకుంటున్నారని విమర్శించారు. జగన్ సైకోయిజం ఏ స్థాయిలో ఉందో ఈ కేసుతో ప్రజలకు అర్థమైందని.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case) అనేది ఒక ఫేక్ కేసు అని.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు సంతకం లేదని లోకేశ్ తెలిపారు. రిమాండ్ రిపోర్టులోనూ చంద్రబాబుపై సరైన ఆధారాలు చూపలేకపోయారని.. మోదీ సీఎంగా ఉన్నప్పుడే గుజరాత్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ అమలుచేశారని గుర్తు చేశారు. గుజరాత్ సహా ఏడు రాష్ట్రాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ అమలు చేస్తున్నారని.. అజేయ కల్లం, ప్రేమ్‌చంద్రారెడ్డి పాత్రపై సీఐడీ సమాధానం చెప్పాలని నిలదీశారు. చంద్రబాబుకు ఏ రూపంలో డబ్బు వచ్చిందో దమ్ముంటే నిరూపించాలని.. చంద్రబాబుపై దొంగకేసు (Fake Cases on Chandrababu) పెట్టి మంత్రులు సంబరాలు చేసుకున్నారంటేనే కక్షసాధింపు అని తెలుస్తోందని అన్నారు. జగన్ హయాంలో సీఐడీ కక్షసాధింపు విభాగంగా మారిపోయిందని మండిపడ్డారు.
ఈ కేసులో ప్రభుత్వం ఒక్క ఛార్జ్‌షీటు కూడా దాఖలు చేయలేకపోయిందన్న లోకేశ్.. తప్పు జరగలేదు కాబట్టే ఛార్జ్‌షీటు వేయలేకపోయారని.. మనీలాండరింగ్ జరగలేదని ఈడీ రిపోర్టులో కూడా చెప్పారని తెలిపారు. జగన్ ప్రభుత్వం.. అనేకమంది టీడీపీ నేతలపై దొంగ కేసులు పెట్టిందన్న లోకేశ్.. తనపై హత్యాయత్నం సహా 20 కేసులు (Cases on Nara Lokesh) పెట్టారన్నారు. 42 వేల కోట్ల రూపాయలు మింగిన జగన్ ఇవాళ బయట తిరుగుతున్నారని.. బాబాయిని చంపిన అవినాష్‌రెడ్డి బయట తిరుగుతున్నారని విమర్శించారు. ఏ తప్పూ చేయని మాపై తప్పుడు కేసులు పెడితే ఊరుకుంటామా అని ప్రశ్నించిన లోకేశ్.. సైకో జగన్‌ను వదిలిపెట్టనని.. ప్రజల్లోకి వెళ్లి పోరాడతానని అన్నారు.
ఎలా తొక్కుకుంటూ వెళ్లాలో తెలుసు: ప్రజల కోసం చేసే పోరాటంలో చంద్రబాబు అరెస్టు స్పీడ్ బ్రేకర్ మాత్రమేనన్న లోకేశ్.. స్పీడ్ బ్రేకర్లను తొక్కుకుంటూ ఎలా వెళ్లాలో తెలిసిన పార్టీ తెలుగుదేశం అని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest) దృష్ట్యా యువగళానికి తాత్కాలిక విరామం ఇచ్చానన్న లోకేశ్.. అన్నీ సర్దుకున్నాక మళ్లీ యువగళం పాదయాత్ర ప్రారంభం అవుతుందని తెలిపారు. మేం ఒంటరివాళ్లం కాదన్న లోకేశ్.. తమది ప్రజాబలం అని అన్నారు. చంద్రబాబు యాత్రలకు వచ్చే స్పందన చూసి తట్టుకోలేకే అక్రమ అరెస్టు అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అన్నగా భావించే పవన్ కల్యాణ్.. తమకు అండగా నిలిచారని లోకేశ్ అన్నారు.
8th క్లాస్ వరకూ సరిగా చూసింది లేదు: మీ పోరాటం ఆపొద్దనే మాట జైలులోకి వెళ్తూ చంద్రబాబు తనకు చెప్పి వెళ్లారన్న లోకేశ్.. నిన్న తన తల్లిదండ్రుల పెళ్లి రోజు, కుటుంబ సభ్యులతో 5నిమిషాలు కూడా మాట్లాడనివ్వలేదని భావోద్వేగం అయ్యారు. చంద్రబాబు జైలుకెళ్లారనే షాక్ లో తమ కుటుంబం ఉందన్న లోకేశ్.. తాను 8th క్లాస్ వరకూ తన తండ్రిని ప్రత్యక్షంగా సరిగా చూసింది లేదని అన్నారు. కుటుంబం కంటే ప్రజా సేవకోసమే పరితపించిన నాయకుడిని ఇలా చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేమని ఆవేదన వ్యక్తం చేశారు. సైకోతో పోరాడుతున్నప్పుడు ఇవన్నీ తప్పవని మాకు మేము సద్ది చెప్పుకున్నామని లోకేశ్ తెలిపారు. యువగళం పాదయాత్ర, మా నాయకుడి పోరాటానికి ప్రభుత్వం భయపడిందని స్పష్టమయిందని.. ప్రజా చైతన్యంలో భాగంగా రేపటి నుంచి పార్లమెంట్ పార్టీ సమావేశాలు నిర్వహించుకుంటూ వెళతామని లోకేశ్ తెలియజేశారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికనూ త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.