Nara Lokesh Family Yuvagalam Padayatra: యువత భవిత కోసం యువగళం అంటూ.. 400రోజుల సుదీర్ఘ పాదయాత్రను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించారు. ప్రజల గుండెచప్పుడు వినేందుకు.. వారి కష్టాలు తెలుసుకుని, కన్నీళ్లు తుడిచి.. భరోసా ఇచ్చేందుకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి యువగళం పేరిట పాదయాత్ర ప్రారంభించారు. 400 రోజులు.. 4వేల కిలోమీటర్లు అంటూ చేపట్టిన యువగళం పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఏ నేతా తిరగనంత స్థాయిలో ఏకంగా 4వేల కిలోమీటర్ల పాదయాత్రకు లోకేశ్ శ్రీకారం చుట్టారు.
నారా లోకేశ్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేపుల క్యాంప్ సైట్ నుంచి 100వ రోజు పాదయాత్రను యువనేత లోకేశ్ ప్రారంభించారు. ఈ పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు సైతం పాల్గొన్నారు. లోకేశ్‌తో కలిసి ఆయన మాతృమూర్తి నారా భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు ముందుకు కదిలారు. మార్గంమధ్యలో తల్లి షూ లేస్ ఊడిపోవడంతో లోకేశ్ దానిని కట్టారు. పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా మోతుకూరులో పైలాన్‌ను లోకేశ్ ఆవిష్కరించారు. యువత సందడి, డప్పు చప్పుళ్లు బాణసంచా మోతతో యువగళం పాదయాత్ర జాతరను తలపిస్తోంది.
కుటుంబసభ్యులు గారపాటి లోకేశ్వరి, హైమావతి, ఇందిర, నందమూరి జయశ్రీ, నందమూరి మణి, సీహెచ్ శ్రీమాన్, సీహెచ్ చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్, కంఠమనేని దీక్షిత, కంఠమనేని బాబీ, ఎనిగళ్ల రాహుల్ తదితరులు లోకేశ్‌తో కలిసి ముందుకు సాగారు. పాదయాత్ర 100 రోజులకు చేరుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో బోయరేవుల క్యాంప్‌సైట్, మోతుకూరు పరిసరాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు తెలంగాణ టీడీపీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, సీనియర్ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు షకీలా రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరామ్ తదితరులు లోకేశ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Chandrababu on Yuvagalm: యువగళం ద్వారా 100రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఆయన తండ్రి, పార్టీ అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి మార్గం కనుగొనేందుకు ఈ అనుభవం ప్రజలకు ఎంతో దగ్గర చేసి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంకా చాలా మైళ్లు ప్రయాణించాలని చంద్రబాబు ఆశించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పారు.
#100DaysofYuvagalam Trending in Twitter: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర వందో రోజుకు చేరుకున్న సందర్భంగా... ఆ పార్టీ నాయకులు, అభిమానులు సామాజిక మాధ్యమాల ద్వారానూ శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో... ట్విట్టర్‌లో తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు సృష్టించిన.. ''హండ్రెడ్ డేస్ ఆఫ్ యువగళం'' హ్యాష్‌ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండవుతోంది. నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ పాదయాత్రలు, సేవా కార్యక్రమాలు చేపట్టి... యువనేతకు మద్దతుగా నిలుస్తున్నారు.
జనహృదయమై నారా లోకేశ్: యువగళం పాదయాత్ర అరాచక వైకాపా సర్కారుపై జనజైత్రయాత్రగా చరిత్రలో నిలిచిపోతుందని.. తెలుగుదేశం నేతలు అన్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా.... పాదయాత్ర విశేషాలతో తెదేపా నేత కేశినేని చిన్ని ప్రత్యేక సంచికను రూపొందించారు. శ్రీశైలం నియోజకవర్గం బోయరేవుల వద్ద.... యువనేత లోకేశ్ ప్రత్యేక సంచిక 'జనహృదయమై నారాలోకేశ్' ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, మాజీ మంత్రి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి, ఏరాసు ప్రతాప్‌రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్, MLC భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, సహా పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: