Bail Granted to YS Sharmila: నాంపల్లి కోర్టులో వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరైంది. సోమవారం రోజున పోలీసులపై చేయి చేసుకున్న కేసులో అరెస్టు అయిన షర్మిలకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.30 వేలతో ఇద్దరి జామీను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఒకవేళ విదేశాలకు వెళితే కోర్టు అనుమతి తీసుకోవాలని షరతు విధించింది. ప్రస్తుతం షర్మిల చంచల్‌గూడ జైలులోనే ఉన్నారు. షర్మిలకు 14రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
షర్మిల తరపున వాదించిన న్యాయవాది.. నోటీసులివ్వకుండానే ఆమెను అడ్డుకున్నారని కోర్టుకు వివరించారు. హైకోర్టు చెప్పినా షర్మిలను బయటకు వెళ్లనివ్వలేదని తెలిపారు. ఆమె విషయంలో పోలీసులు ఇష్టారీతిగా వ్యవహారించారని వాదించారు. ఆమెను ఎస్ఐ తాకేందుకు యత్నం చేశారని ఆరోపించారు. పోలీసుల తరపున వాదించిన న్యాయవాది.. షర్మిల పోలీసులపై చేయి చేసుకున్నారని తెలిపారు. వేగంగా కారు పోనివ్వాలని ఆమె డ్రైవర్‌కు సూచించారని వివరించారు. దీంతో ఆమె కారు తగిలి కానిస్టేబుల్ కాలుకు గాయమైందని కోర్టులో వాదించారు. గతంలో కూడా షర్మిలపై కేసులు ఉన్నాయని వివరించారు.
ఇదీ జరిగింది: సోమవారం ఉదయం బయటకు వెళుతున్న వైఎస్ షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అడ్డుకున్నారు. పని మీద బయటకు వెళ్తున్ తనను అడ్డుకోవడంతో పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వారితో కాస్త దురుసుగా ప్రవర్తించారు. అంతటి ఆగకుండా ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్‌పై చేయి చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులపై చేయి చేసుకున్నందుకు షర్మిలపై కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆమెపై సెక్షన్ 353, 332, 509, 427 కింద కేసు నమోదు చేశారు. వాటితో పాటుగా 337, రెడ్‌విత్ 34, మరో రెండు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.
మరోవైపు.. ఇవాళ చంచల్‌గూడ జైలులో ఉన్న షర్మిలను పరామర్శించడానికి తన తల్లి వైఎస్ విజయమ్మ అక్కడికి వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. షర్మిలకు బెయిల్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బెయిల్ రాగానే షర్మిల మళ్లీ తన పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. అన్ని పార్టీల సభలకు అనుమతి ఇచ్చే కేసీఆర్ సర్కార్.. తన బిడ్డను మాత్రం అడుగడుగునా అడ్డుకుంటోందని ఆక్షేపించారు. ప్రశ్నించే గొంతుకను కేసీఆర్ నొక్కేయాలని చూస్తున్నారని విమర్శించారు. విజయమ్మ చెప్పినట్లుగానే షర్మిలకు బెయిల్ మంజూరయింది. అయితే ఈ వ్యవహారంలో షర్మిల స్పందన ఏంటనేది తాను జైలు నుంచి విడుదలైన తర్వాతే తెలుస్తుందని రాజకీయ వర్గాల్లో టాక్.
ఇవీ చదవండి: