కరోనా వైరస్(Covid virus) నుంచి కోలుకున్న వారిపై బ్లాక్‌ఫంగస్(Black Fungus) పంజా విసురుతోంది. ఈ వ్యాధి చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అలాంటి ఘటనో మహారాష్ట్రలో జరిగింది. నాగ్‌పుర్‌లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న నవీన్ పాల్‌కు గత ఏడాది సెప్టెంబర్‌లో బ్లాక్‌ఫంగస్ సోకింది. ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి రూ.1.48 కోట్లు ఖర్చు అయ్యాయి.
ఇదీ జరిగింది..
మహమ్మారి నుంచి కోలుకున్న కొద్ది రోజులకు పాల్‌కు కళ్ల సమస్య మొదలైంది. చికిత్స కోసం నాగ్‌పుర్, హైదరాబాద్‌లోని వైద్యులను సంప్రదించాడు. రెండు నెలలు గడిచినా ఎలాంటి ఫలితం లేకపోయింది. పాల్‌కు వచ్చిన సమస్యను వైద్యులు గుర్తించలేకపోయారు. దీంతో నవంబరులో పాల్ ముంబయిలోని హిందుజా ఆస్పత్రిలో చేరాడు. బ్లాక్‌ఫంగస్ సోకినట్లు గుర్తించిన వైద్యులు చికిత్సను ప్రారంభించారు.
ఖర్చులు భరించలేక..
ముంబయిలోని హిందూజా ఆస్పత్రి వైద్యులు అతనికి మూడు శస్త్రచికిత్సలు చేశారు. మందులు, ఇన్జెక్షన్ల ఖర్చులు రోజురోజుకూ పెరిగిపోవడం వల్ల నవీన్ పాల్.. నాగ్పుర్లోనే చికిత్స తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. డిసెంబరులో నాగ్‌పుర్ చేరుకున్న పాల్.. అతని భార్య రైల్వే ఉద్యోగి కావడం వల్ల స్థానిక రైల్వే ఆస్పత్రిలో చేరాడు.
అక్కడి వైద్యలు పాల్ ఎడమ కన్ను సహా ఇన్ఫెక్షన్కు గురైన నోటిలో కొంత భాగాన్ని తొలగించారు. ప్రస్తుతం కళ్ల సమస్య కొంత తగ్గినట్లు పాల్ పేర్కొన్నాడు.
ఇదీ చదవండి : Black Fungus: వ్యాధికి చికిత్స ఉందా?