Amit shah statement on Nagaland fire incident: నాగాలాండ్ కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. ఘటనపై సిట్‌ను ఏర్పాటు చేసినట్టు, నెల రోజుల్లోగా దర్యాప్తు పూర్తిచేయాలని ఆదేశించినట్టు తెలిపారు. తిరుగుబాటుదారులపై చర్యలు చేపట్టే క్రమంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అన్ని సంస్థలకు సూచించారు.
నాగాలాండ్ ఘటనపై ఉభయ సభల్లో సోమవారం మధ్యాహ్నం ప్రకటన చేశారు అమిత్ షా. తొలుత లోక్‌సభలో ప్రసంగించిన ఆయన.. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలిపారు.
"మోన్ పట్టణంలో తిరుగుబాటుదారులు సంచరిస్తున్నట్టు పక్కా సమాచారంతో 21 పారా కమాండో బృందం ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో ఓ వాహనాన్ని జవాన్లు అడ్డుకున్నారు. అదేశాలిచ్చినా, ఆ వాహనం ఆగలేదు. దీంతో అనుమానం మరింత పెరిగి, జవాన్లు కాల్పులు జరిపారు. వాహనంలో ఉన్న 8 మందిలో ఆరుగురు మరణించారు. అయితే వాహనంలో ఉన్నది తిరుగుబాటుదారులు కాదని, పౌరులను ఆ తర్వాత తెలిసింది. జవాన్లే వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సైనిక శిబిరాలను ధ్వంసం చేశారు. ప్రజలు చెదరగొట్టేందుకు జవాన్లు కాల్పులు జరపక తప్పలేదు. ఈ ఘటనలో ఓ జవానుతో పాటు మరో ఏడుగురు పౌరులు మరణించారు."
-- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.
అమిత్ షా చేసిన ప్రకటనపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. అటు నాగాలాండ్ కాల్పుల అంశం నేపథ్యంలో రాజ్యసభలో ఉదయం నుంచి వాయిదాల పర్వం కొనసాగింది. అమిత్ షా చేసిన ప్రకటన అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది.
ఇదీ చూడండి:- నాగాలాండ్ ఘటనపై రగడ- పార్లమెంటులో వాయిదాల పర్వం