అధికార అన్నా డీఎంకేతో కలిసే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనుంది భాజపా. ఈ విషయాన్ని స్వయంగా ధ్రువీకరించారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. మదురైలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
''అన్నాడీఎంకే, అలాంటి ఆలోచనలున్న ఇతర పార్టీలతో కలిసే ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించాం. ఏఐఏడీఎంకే పార్టీతో భాజపా పొత్తు కొనసాగుతుంది. రెండు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్తాయి.''
- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు.
అంతకుముందు ఆయన మధురైలోని మీనాక్షి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం తమిళనాడు భాజపా కోర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరై రాష్ట్ర స్థాయి నాయకులతో ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు.
మోదీతోనే సాధ్యం..
తమిళనాడులో అభివృద్ధి భాజపాతోనే సాధ్యం అవుతుందని ఉద్ఘాటించారు నడ్డా. తమిళ సంప్రదాయాల పరిరక్షణ భాజపాతోనేనని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం ప్రగతి పథంలో దూసుకెళ్తోందని వ్యాఖ్యానించారు. కొవిడ్-19 నియంత్రణ, వ్యాక్సినేషన్, సరిహద్దుల్లో భద్రత సహా అన్నింట్లో కేంద్రం పనితీరును ప్రశంసించారు.
ఏప్రిల్-మేలో తమిళనాడు శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, భాజపా, డీఎండీకే, పీఎంకే కూటమిగా పోటీచేశాయి.
ఇదీ చూడండి: ఎన్నికల వేళ 'ప్రచార రథాల' వైపు నేతల చూపు!