కర్ణాటక రాష్ట్ర పండుగ అయిన దసరా ఉత్సవాలు(Mysore Dasara) ఘనంగా జరుగుతున్నాయి. ఎప్పటిలానే వడయార్ వంశానికి చెందినవారి చేతులు మీదుగా ఉత్సవం ప్రారంభమైంది. వడయార్ వారసుడు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ చేత అర్చకులు మైసూరు కోటలో శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. అనంతరం శమీ వృక్షాన్ని ఆరాధించారు.


గజరాజుల అలంకరణ
ఉత్సవాల్లో భాగంగా.. రాజవంశస్థుల ఆధ్వర్యంలో సాయంత్రం జంబూ సవారీ(Mysore Dasara) నిర్వహించనున్నారు. ఇందుకు ఏనుగులు అందంగా అలంకరించారు. గజరాజు మీద స్వర్ణ అంబారీ ఉంచి, అందులో చాముండి దేవి విగ్రహాన్ని ఊరేగిస్తారు. స్వర్ణ అంబారీ కట్టిన ఏనుగుతో పాటు మొత్తం ఆరు గజరాజులు.. ఈ వేడుకలో పాల్గొంటాయి.

ఈసారి తక్కువ మందితోనే..
జానపద నృత్యాలు, దివిటీల విన్యాసాలతో మైసూరు వీధుల్లో సందడిగా జరగాల్సిన దసరా(Mysore Dasara).. గతేడాదిలా ఈసారి కూడా నిరాడంబరంగా జరుగుతోంది. కరోనా ఆంక్షల నేపథ్యంలో.. సాంస్కృతిక కార్యక్రమాలకు 500 మందికి మించకుండా అనుమతించారు.

400 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం
వడయార్ వంశస్థులు మొదటగా శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అయితే 1610లో తమ రాజధానిని మైసూరుకు మార్చారు. ఆ సందర్భంగా దసరా వేడుకలు నిర్వహించారు. 1947లో స్వతంత్ర భారతదేశంలో విలీనం అయినప్పటికీ.. వేడుకలు మాత్రం 400 ఏళ్లుగా నిర్విగ్నంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వేడుకను తిలకించేందుకు దేశవిదేశాల నుంచి పర్యటకులు తరలివస్తారు.
ఇదీ చూడండి: ఈ నగరాలన్నీ అమ్మవారి పేర్లతోనే వెలిశాయి