లవ్ జిహాద్‌పై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో.. ఆ తరహా ఉదంతం మరొకటి వెలుగులోకి వచ్చింది. హిందూ యువతిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువకుడు మతం మారాల్సిందిగా ఒత్తిడి చేశాడు. దీంతో ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది.
పోలీసుల కథనం ప్రకారం.. బిహార్ కతిహార్ జిల్లాకు చెందిన తాకీర్ ఆలాం దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అర్చన అనే యువతికి 2015లో ఫేస్‌బుక్‌కు ద్వారా పరిచయం అయ్యాడు. ఆ క్రమంలో తాను ఓ హిందువునని.. తన పేరు రాజ్ రాజ్‌పుత్‌గా పరిచయం చేసుకున్నాడు. అనంతరం వారి పరిచయం ప్రేమగా మారింది. దుబాయ్ నుంచి వచ్చిన తాకీర్.. అర్చనను తన కుటుంబ సభ్యుల మధ్య హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాడు.
కొద్ది రోజుల తర్వాత అర్చనను తన ఇంటికి తీసుకెళ్లాడు తాకీర్. అప్పుడే అతడొక ముస్లిం అని.. అంతకముందే అతడికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారని అర్చనకు తెలిసింది. అప్పటినుంచి తాకీర్, అతడి కుటుంబ సభ్యులు అర్చనను తీవ్రంగా కొడుతూ, మతం మారమని ఇబ్బందులకు గురి చేశారు. "నేను ఒక హిందువు. నన్ను మోసం చేసి తాకీర్ వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత తన సోదరి ఇంట్లో ఉంచాడు. వాళ్ల ఇంటికి తీసుకెళ్లేవాడు కాదు. ఇప్పుడు మతం మారమని నన్ను తీవ్రంగా హింసిచాడు." అని అర్చన పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని.. దర్యాప్తు చేసి నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జితేంద్ర కుమార్ తెలిపారు.