గుజరాత్లో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. వైరస్ సోకినవారిలో రోజుకు సగటున 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితుల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది వడోదరలోని పారూల్ ఆస్పత్రి. అక్కడి రోగుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు 'మ్యూజిక్ థెరపీ(సంగీత చికిత్స)' పద్ధతిని పాటిస్తోంది. వారిలో ఎలాంటి భయాందోళనలు దరి చేరనీయకుండా ఆటపాటలు, చప్పట్లతో.. ఆత్వవిశ్వాసాన్ని నింపుతోంది.
స్టెప్పులు.. చప్పట్లు..
కొవిడ్ రోగులకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో.. వైద్య సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి నృత్యం చేస్తూ వారిని అలరిస్తున్నారు. ఓ వైపు వారు స్టెప్పులేస్తుంటే.. మరోవైపు వృద్ధులతో సహా.. ఇతర రోగులంతా వారితో పాటు సరదాగా చప్పట్లు కొడుతూ ఆనందంగా గడిపారు. పారూల్ ఆస్పత్రి అవలంబిస్తున్న ఈ మ్యూజిక్ థెరపీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. కరోనా రోగుల్లో ఆత్మ విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేందుకు ఆస్పత్రి యాజమాన్యం చక్కటి సేవలందిస్తోందని కితాబిచ్చారు.
ఇదీ చదవండి: రైల్వేస్టేషన్లలో మాస్క్ లేదంటే రూ.500 ఫైన్